భారత క్రికెట్ జట్టు తొలి టెస్ట్ కెప్టెన్ కొట్టారి కనకయ్య నాయుడు(సి.కె.నాయుడు) గారి గురించి ప్రస్తుత తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ రోజుల్లో ఆయనంటే సిక్సర్ల రారాజు. బౌలర్ గా తన ఫస్ట్ క్లాసు కెరీర్ ని మొదలు పెట్టి, బారీ సిక్సర్లతో, సి.కె.నాయుడు అంటే సిక్సర్ల నాయుడు అనిపించుకున్న హీరో. ఆరడుగుల ఒకటిన్నర అంగుళాల పొడవు. రాజసం తొణికిసలాడే ఆకారం. బలమైన చేతులు. రబ్బరులా ఎటుపడితే అటు తిరిగే ముంజేతులు, డేగలాంటి కళ్ళు. వీటన్నింటినీ మించి ప్రత్యర్థిని అధిగమించాలనే ప్రగాఢ వాంఛ. ఇన్ని గుణగణాలతో ఆయన బ్యాటింగ్ కోసం మైదానంలోకి నడిచొస్తుంటే చూసేవాళ్ళకు అడవిలో వేటకు బయలుదేరిన సింహంలా కనిపించేవారు. అలాంటి అలనాటి తెలుగు ముద్దుబిడ్డ సి.కె.నాయుడు జయంతి నేడు. ఈ సందర్బంగా ఆయనను ఓసారి స్మరించుకుందాం..
సి.కె.నాయుడు 1895, అక్టోబర్ 31న నాగపూర్ లోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సూర్యప్రకాశరావు నాయుడు హోల్కర్ సంస్థానంలో న్యాయమూర్తిగా ఉంటూ, నాగపూరులో స్థిరపడ్డారు. ఈ తరుణంలో ఆయన అక్కడే జన్మించారు. అయితే ఆయన పూర్వీకులు మాత్రం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన వారు. సి.కె.నాయుడు పాఠశాల రోజులనుండే క్రికెట్ ఆటలో ఎంతో ప్రతిభ కనపరిచేవారు. ఈ క్రమంలో 1916లో జరిగిన హిందూ జట్టు వర్సెస్ యూరోపియన్ జట్టు మ్యాచుతో ఆయన క్రికెట్ ప్రస్థానం మొదలైంది. ఈ మ్యాచులో నాయుడు, తాను ఎదుర్కొన్న నాలుగో బంతినే సిక్సర్ గా మలుస్తాడు. ఆపై హిందువులు వర్సెస్ తెల్ల దొరలు మధ్య జరిగిన మ్యాచ్ తన జీవితాన్నే మలుపుతిప్పింది. ఈ మ్యాచులో నాయుడు.. సిక్సర్లతో ముంబాయి జింఖాన మైదనాన్ని హోరెత్తించాడు. మొత్తం జట్టు స్కోరు 187 ఐతే, సి కె వంతు 153 పరుగులు. అలా మొదలైన అయన క్రికెట్ ప్రస్థానం.. రెండు దశాబ్దాల పాటు కొనసాగింది.
Remembering Colonel CK Nayudu – India’s first Test captain – on his birth anniversary. 🙏 pic.twitter.com/NyLIwGCWBB
— BCCI (@BCCI) October 31, 2022
1932లో భారత జట్టు తన తొలి టెస్టు మ్యాచ్ను ఇంగ్లండ్తో ఆడింది. ఆ జట్టుకు సీకే నాయుడే కెప్టెన్. నాయుడు బ్యాటింగ్ చేస్తుంటే వినసొంపైన సంగీతంలా ఉండేది. ఆయన కొట్టే సిక్సర్లు చూస్తుంటే బంతిని చేత్తో తీసి హనుమంతుడిలా మైదానం బయటకు విసిరేస్తున్నాడేమో అన్న భ్రమలో ప్రేక్షకులు కేరింతలు కొట్టేవారు. ఆయన ఇంకాస్త ఆలస్యంగా పుట్టివుంటే భారతీయ క్రికెట్ చరిత్ర మరెంత అందంగా ఉండేదో. ఇక్కడ మరో విషయం ఆయనను ‘కల్నల్ నాయుడు’ అని కూడా పిలుస్తుంటారు. అందుకు కారణం.. 1923లో భారత సైన్యం ఆయనను తమ సైన్యంలో అత్యున్నత పదవినిచ్చి సత్కరించింది. చాలా మందికి తెలియదు. అంతేకాదు..
#BirthAnniversary of CK Nayudu, 🇮🇳’s 1st Test captain
He was an upright batter, a fine driver & a very handy slow-medium bowler
His best innings was his last, at The Oval in 1936, when he refused to retire hurt after getting hit & made a patient 81 to avoid innings defeat pic.twitter.com/T13HcbEMp2
— North Stand Gang – Wankhede (@NorthStandGang) October 31, 2022
దేశంలో ఆయన పేరు మీద “సి కె నాయుడు ట్రోఫీ” అని ఒక దేశవాళీ టోర్నీయే జరుగుతుంది. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి క్రికెటర్ కూడా ఆయనే. వాణిజ్య ప్రకటనలకు క్రికెటర్లను ఎంపిక చేసుకోవడం కూడా ఆయనతోనే మొదలైంది. అప్పట్లో ఓ టీ కంపెనీ తమ ప్రకటనల్లో సీకే నాయుడి చిత్రాన్ని వాడుకునేది. భారతదేశంలో ఉక్కుమనిషిగా పిలుచుకునే సర్దార్ వల్లభాయి పటేల్ జన్మదినం, సీకే నాయుడు జన్మదినం ఒకటే(అక్టోబరు 31). అందుకే.. ఆరడుగుల ఎత్తుతో, బలిష్టమైన దేహంతో బలమైన షాట్లతో విరుచుకుపడే సీకే నాయుడిని క్రికెట్లో ఉక్కుమనిషిగా అభివర్ణిస్తుంటారు. అలాంటి బలిష్ట వ్యక్తిని ఈ తరం క్రికెటర్లు స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే మచిలీపట్నంలో ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ తరం క్రీడాకారులకు ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.