కొత్త ఏడాదిలో భారత్ వరుస విజయాలతో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మిత్రం దేశం శ్రీలంకపై టీ20 సిరీస్(2-1), వన్డే సిరీస్(3-0)ను సొంత చేసుకున్న టీమిండియా, పర్యాటక దేశం న్యూజిలాండ్‌ను కూడా చిత్తు చేసింది. టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో, వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు మరో సమరానికి సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 9 నుంచి కంగారూలతో అమీ.. తుమీ.. తేల్చుకోనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా స్వదేశంలో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచులు జరగనున్నాయి. ఈ సిరీస్‌లోని చివర టెస్ట్ కు ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు.
ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు సమరమే. ఇరు జట్లలో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉండడం, స్లెడ్జింగ్, గొడవలు మ్యాచుపై అభిమానులకు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఏ సెషన్ లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఊహించడం కష్టం. పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్ వుడ్, స్కాట్ బోలాండ్ లతో కూడిన ఆసీస్ పేస్ దళం భారత బ్యాటర్లను కాస్త ఇబ్బందిపెట్టొచ్చు. కానీ, స్పిన్నర్లకు అనుకూలించే స్వదేశీ పిచులపై అశ్విన్, జడేజా, అక్సర్ పటేల్ త్రయాన్ని ఎదుర్కోవడం ఆసీస్ బ్యాటర్లకు అతి పెద్ద సవాల్ అని చెప్పుకోవాలి. అందులోనూ.. టెస్ట్ ఛాంపియన్ షిప్ పోరులో ఆస్ట్రేలియా అగ్రశ స్థానంలో ఉండటం, ఫైనల్ కు అర్హత సాధించాలంటే భారత్ ఈ సిరీస్ తప్పక గెలవాల్సి ఉండడంతో ఇరుజట్లు మధ్య హోరా హోరీ పోరు తప్పకపోవచ్చు.
నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టుతో ఈ చారిత్రాత్మక సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా రెండో టెస్ట్, ధర్మశాలలోని హెచ్‌పీసీఏలో మూడో టెస్ట్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ ఆఖరి మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారని సమాచారం. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియాన్ని భారత జట్టుకు సొంత మైదానంగా మార్చేసిన బీసీసీఐ, చివరి టెస్టుకి ఇరుదేశాల ప్రధానులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలని భావిస్తోందట. అందులోనూ.. మార్చి నెలలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉండటంతో వీరిద్దరూ కలిసి ఫైనల్ టెస్టు మ్యాచ్‌ని వీక్షించనున్నారని వార్తలొస్తున్నాయి.
Narendra Modi & Anthony Albanese will be together watching the 4th Test between India vs Australia in Ahmedabad. (Source – TOI)
— Johns. (@CricCrazyJohns) February 2, 2023
మొదటి టెస్ట్: ఫిబ్రవరి 9- 13 నాగ్‌పూర్
రెండో టెస్ట్ : .ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
మూడో టెస్ట్: మార్చి 1-5: ధర్మశాల
నాలుగో టెస్ట్: మార్చి 9- 13: అహ్మదాబాద్