భారత్, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆఖరి టెస్టును బీసీసీఐ, ఈసీబీ మాట్లాడుకుని రద్దు చేశారు. టీమిండియా హెట్ కోచ్ సహా పలువురికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్‌ను రద్దుకు అంగీకరించారు. ఆ విషయంలో క్రికెట్ అభిమానులు చాలా నిరాశ చెందారు. 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్న భారత్.. కచ్చితంగా సిరీస్ కైవశం చేసుకుంటుందన్న ఆశతో ఎదురుచూసిన అభిమానులకు కరోనా కారణంగా పెద్ద షాకే తగిలింది. ఇదిలా ఉండగా ఆ సిరీస్ ఫలితంగా కూడా తేలలేదు. దాని మీద కూడా పెద్దఎత్తున రచ్చ చేస్తోంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అక్కడి వార్తా సంస్థలైతే బీసీసీఐ, కోహ్లీసేనపై దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఐపీఎల్ సెకెండాఫ్ దగ్గరపడుతున్న నేపథ్యంలోనే టీమిండియా ఇలా చేసిందంటూ ఈసీబీ, ఇంగ్లాండ్ మీడియా సంస్థలు ప్రచారాలు మొదలెట్టాయి. వారికి కాసులు కురిపించే ఐపీఎల్ అంటేనే ఎక్కువ ప్రాధాన్యత అని టెస్టు మ్యాచ్ అంటే లెక్కలేదంటూ నోరు పారేసుకుంటున్నారు. ఆటగాళ్లకి నెగిటివ్ వచ్చినా కావాలనే టెస్టును ఆడలేదని ఆరోపిస్తున్నారు. బీసీసీఐ చర్యతో తమకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్తున్నారు.
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ నిబంధనల ప్రకారం కరోనా భయంతో టెస్టు మ్యాచ్‌ను రద్దు చేయవచ్చు. ఇప్పుడు అలా కరోనా కారణంగా మ్యాచ్ రద్దైందని ప్రకటిస్తే వారికి రావాల్సిన బీమా సొమ్ము రాదని ఈసీబీ బాధపడుతోంది. మాకు న్యాయం చేయండంటూ ఐసీసీకి లేఖ రాసింది ఈసీబీ. ఐదో టెస్టును పూర్తిగా రద్దు చేస్తే సిరీస్ నాలుగు టెస్టులకే పరిమితం అవుతుంది. అంటే 2-1 ఆధిక్యంతో సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. లేదు ఐదో టెస్టును నిర్వహించాలని ఐసీసీ తెలిపి.. అందుకు టీమిండియా ఒప్పుకోకపోతే అప్పుడు ఇంగ్లాండ్‌కు ఫేవర్‌గా ఫలితం ఇస్తారు. అప్పుడు 2-2తో సిరీస్ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో ఐదో టెస్టును నిర్వహించేందుకు బీసీసీఐ సుముఖతగానే ఉంది. కానీ, మ్యాచ్‌ని రీషెడ్యూల్ చేయాలని భావిస్తోంది. దానికి సంబంధించి ఈసీబీ, అక్కడి బ్రాడ్‌కాస్టింగ్ భాగస్వాములతో చర్చించేందుకు గంగూలీ సెప్టెంబర్ 22న ఇంగ్లాండ్‌కు వెళ్తున్నాడు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది పొట్టి క్రికెట్ సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలోనే ఐదో టెస్టు మ్యాచ్‌ను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ మీడియా, క్రికెట్ బోర్డు సహా మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీసేనపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఐపీఎల్ కోసమే ఇలా చేస్తున్నారంటూ ఆడిపోసుకుంటున్నారు. అందుకు భారత అభిమానులు సైతం గట్టిగానే బదులు చెప్తున్నారు. సౌతాఫ్రికాలో కరోనా కేసులు లేకపోయినా ఆ వంకతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను మీరు ఎందుకు బాయ్‌కాట్ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. పరిస్థితులు బాగానే ఉన్నా సిరీస్ నుంచి తప్పుకుని ఇప్పుడు ఇలా ఎలా మాట్లాడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
లండన్ హోటల్‌లో రవిశాస్త్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో కోహ్లీ సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. ముందు రవిశాస్త్రితో మొదలై కోచ్‌లు, సహాయకుల వరకు కరోనా వ్యాపించింది. అసలు ఆ కార్యక్రమానికి వెళ్లడానికి మా అనుమతి కోరలేదంటూ ఈసీబీ ఆరోపిస్తోంది. ఆ కార్యక్రమంలో వల్లే కరోనా వ్యాపించిందంది. కర్ర విరగకుండా, పాము చావకుండా మధ్యే మార్గంగా నిర్ణయం తీసుకుంటేనే ఈ వివాదం సద్దుమణుగుతుంది. అందుకు దాదా ఏ చేస్తాడన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం