ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆరంభంలోనే వివాదం రాజుకుంది. క్రికెటర్‌ను లీగ్ నుంచి తప్పించడంతో ఈ వివాదం మొదలైంది. మరి దీనిపై బీసీసీఐ స్పందిస్తుందా?
ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయే డబ్ల్యూపీఎల్(ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) శనివారం ఎంతో అట్టహాసంగా ఆరంభమైంది. సినీతారల ఆటాపాట, లేజర్ కాంతుల తళుకులతో డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ మొదలైంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్-గుజరాత్ జెయింట్స్ తలపడగా.. ముంబై ఘనవిజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో పాటు ముంబై బౌలర్లు అదరగొట్టడంతో ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ చిత్తుగా ఓడింది. మ్యాచ్ విషయం పక్కనపెడితే.. ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ డబ్ల్యూపీఎల్ ఆరంభం రోజునే వివాదం రాజుకుంది.
ఇటివల జరిగిన వేలంలో గుజరాత్ జెయింట్స్ వెస్టిండీస్ క్రికెటర్, స్టార్ ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్‌ను రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ.. లీగ్ ఆరంభానికి రెండు రోజుల ముందు.. ఆమెను తప్పించి ఆమెను స్థానంలో వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా క్రికెటర్ కింబెర్లీ గార్త్‌ను జట్టులోకి తీసుకుంది. వేలంలో అమ్ముడుపోయి.. ప్రతిష్టాత్మక డబ్ల్యూపీఎల్‌లో ఆడబోతున్నానని సంతోష పడ్డ డాటిన్‌కు గుజరాత్ షాకిచ్చింది. పూర్తిస్థాయిలో ఫిట్నెస్ లేని కారణంగా ఆమెను తప్పిస్తున్నట్లు గుజరాత్ పేర్కొంది. అయితే.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, తనను డబ్ల్యూపీఎల్ నుంచి తప్పించడం సరికాదని డాటిన్ పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.
‘త్వరగా కోలుకోవాలని నాకు సందేశాలు పంపుతున్న వారందరికి కృతజ్ఞతలు. కానీ, నేను ఎలాంటి గాయంతో బాధపడటం లేదు.’ అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. గాయానికి చికిత్స తీసుకుంటున్న డాటిన్ ఇంకా కోలుకోలేదని, అందుకే ఆమె స్థానంలో గార్త్‌ను తీసుకుంటున్నట్లు గుజరాత్ మేనేజ్మెంట్ వెల్లడిచింది. వేలంలో రూ.50 లక్షల కనీస ధర ఉన్న డాటిన్‌ను గుజరాత్ రూ.60 లక్షలకు దక్కించుకుంది. అయితే.. ఆమె స్థానంలో ఇప్పుడు గుజరాత్ టీమ్‌లోకి వచ్చిన కింబెర్లీ గార్త్‌ను వేలంలో ఏ జట్టు పట్టించుకోలేదు. దీంతో ఆమె అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. అయితే.. గుజరాత్ జెయింట్స్ నిర్ణయంతో గార్త్‌కు అనూహ్యంగా అదృష్టం కలిసి వచ్చి డబ్ల్యూపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. మరి ఈ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
I really appreciate all the messages but truth be told I’m recovering from nothing but the Holy Ghost anointing thank you 🙏🏾 #GodIsGood #GodIsInControl
— Deandra Dottin (@Dottin_5) March 4, 2023