షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్‌కప్ భారత్ వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగనుంది. 2022 టీ20 వరల్డ్‌కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. భారత్ వేదికగా అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఇప్పటి నుంచే వీసా సమస్య గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరికల్ని మొదలుపెట్టింది. ఇన్నిరోజులూ పాకిస్థాన్ టీమ్, కోచ్, సహాయ సిబ్బందికి వీసాలు ఇస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చిన పీసీబీ తాజాగా ఆ దేశ అభిమానులకి, జర్నలిస్ట్‌లు, అధికారులకి కూడా వీసాలు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. వీసాలు ఇస్తామని భారత ప్రభుత్వం రాత పూర్వకంగా మార్చిలోపు హామీ ఇవ్వాలని కోరిన పీసీబీ ఒకవేళ హామీ ఇవ్వని పక్షంలో టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్యాన్ని యూఏఈకి మార్చేలా ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించింది.
భారత్, పాకిస్థాన్ మధ్య స్నేహసంబంధాలు దెబ్బతినడంతో రెండు జట్లు ఇప్పటికే ద్వైపాక్షిక సిరీస్‌లకి దూరంగా ఉంటున్నాయి. కేవలం ఐసీసీ ఈవెంట్స్‌లో మాత్రమే ఈ రెండు దేశాలు క్రికెట్‌లో తలపడుతున్నాయి. 2016 టీ20 వరల్డ్‌కప్‌కి భారత్ ఆతిథ్యం ఇవ్వగా అప్పుడూ ఇలానే పాకిస్థాన్ నుంచి హెచ్చరికలు, కవ్వింపులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకి భారత్‌కి వచ్చిన పాకిస్థాన్ టీమ్ ఆ టోర్నీలో ఆడి స్వదేశానికి వెళ్లింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ ఆటగాళ్లతో పాటు అభిమానులు, అధికారులు, జర్నలిస్ట్‌లకి వీసాలు లభించడం కష్టమే.
భారత్‌లో కరోనా రెండో దశ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని బీసీసీఐ అంటోంది. దేశంలో కొవిడ్ ఉధృతి తగ్గకుంటే యూఏఈకి ఈ మెగా టోర్నీని తరలించనున్నట్టు వార్తలు వస్తున్నా దానిపై ముందే స్పందించడం సరికాదని బీసీసీఐ శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 భారత్‌లో టోర్నీ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం భారత్‌లోనే ఈ టోర్నీ జరిగే అవకాశముందన్న బీసీసీఐ టోర్నీ వేదికలను మాత్రం 9 నుంచి 5 నగరాలకు కుదించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది.