ఉప్పల్ వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు రాజకీయ రంగు పులుముకుంది. ఆఫ్ లైన్ టికెట్ల కోసం జనాలు వేలాది సంఖ్యలో జింఖానా గ్రౌండ్స్ కు తరలిరావడం, అది కాస్తా తొక్కిసలాటకు దారితీయడంతో ఈ చర్చ మొదలైంది. ఈ తొక్కిసలాటలో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే.. ఈ విషయంపై సుప్రీం కోర్టు హై లెవెల్ కమిటీని కూడా నియమించింది. తాజాగా, ఈ విషయంపై మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పందించారు. టికెట్ల అమ్మకాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించిన ఆయన, ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.
పేటీఎంకు కాంట్రాక్టు ఇవ్వడంలోనే భారీగా అవకతవకలు జరిగాయని చెప్పిన విశ్వేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ ఈ గోల్‌మాల్‌కు తెరలేపాడన్నారు. ఎప్పుడో అర్ధరాత్రి ఆన్ లైన్ లో పెడితే.. 20 నిమిషాల్లోనే 30 వేలకు పైగా టిక్కెట్లు ఎలా అమ్ముడు పోతాయని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్రికెట్ టికెట్ల విషయంలో ఎంటర్ అయ్యారని చెప్పిన ఆయన, అందరూ కలిసి టికెట్లను బ్లాక్‌లో అమ్మేసి భారీగా సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో ప్రభుత్వంకు ఏమి సంబంధం ఉందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు.. మ్యాచ్ నిర్వహణ సజావుగా సాగేలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2500 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. స్టేడియంలో మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వాటిని బంజరాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేశామని, స్టేడియంలో జరిగే ప్రతి కదలికను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. స్టేడియంలోకి సెల్ ఫోన్స్, బ్లూటూత్ కు అనుమతి ఉందని.. అయితే సిగరెట్, కెమెరాలు, ఆల్కహాల్, షార్ప్ ఆబ్జెక్ట్స్, వాటర్ బాటిల్స్, హెల్మెట్స్, పెట్స్, ఫైర్ క్రాకర్స్, ఫుడ్, బ్యాగ్స్, సెల్ఫీ స్టిక్స్ కు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.