క్రికెట్ లో ధనా ధన్ లీగ్ అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది ఐపీఎల్ మాత్రమే. కానీ.., ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా వాయిదా పడింది. జట్లలో కొంత మంది ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.., ఐపీఎల్ వాయిదా తరువాత విదేశీ ఆటగాళ్లను వారి వారి దేశాలకి చేర్చే బాధ్యత కూడా బీసీసీఐ తీసుకుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెటర్స్ తమ స్వస్థాలను చేరుకున్నారు. కానీ.., ఆస్ట్రేలియా ఆటగాళ్లతో మాత్రం బీసీసీఐకి కొన్ని తల నొప్పులు తప్పలేదు. ఎందుకంటే.. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో ఆస్ట్రేలియా.. భారత్ నుండి రాకపోకలను బంద్ చేసింది. దీనితో తమ దేశ ఆటగాళ్ళని కూడా ఇండియా నుండి నేరుగా ఆస్ట్రేలియాకి తీసుకుని రావడానికి ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఒప్పుకోలేదు. దీనితో మరో మార్గం లేక ఆస్ట్రేలియా ఆటగాళ్లు, కోచ్ లు, కామెంటర్స్ అందరినీ మాల్దీవ్స్ కు తరలించింది బీసీసీఐ. అక్కడ కొన్ని రోజులు క్వారెంటైన్ పూర్తి చేసుకున్న తరువాత తమ ఆటగాళ్ళని ఆస్ట్రేలియా తీసుకుని వెళ్లొచ్చు అన్నది క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.., మాల్దీవ్స్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు తప్పతాగి ఒకరితో ఒకరు గొడవ పడి.., కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళిందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, స్టోయిన్స్, కమ్మిన్స్, కామెంటర్స్, కోచ్ లు మాల్దీవ్స్ లోని రిసార్టులో చిల్ అవుతున్నారు. కానీ.., అక్కడ బార్ లో డేవిడ్ వార్నర్, మాజీ క్రికెటర్ మైకేల్ స్లేటర్ తాగిన మైకంలో కొట్టుకున్నారని వార్తలు వచ్చాయి. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే టి ట్వంటీ వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టు కూర్పు విషయంలో చర్చ జరుగుతూ ఉండగా ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. టీ ట్వంటీ జట్టు కెప్టెన్ గా ఫించ్ సామర్ధ్యంపై వార్నర్ నోరు జారడంతో గొడవ మొదలైనట్టు తెలుస్తోంది. దీనితో అక్కడే ఉన్న మిగతా ఆటగాళ్లు వీరిని వేరు చేసి తమ తమ గదుల్లోకి పంపించి వేసినట్టు సమాచారం. అయితే.., తమపై వచ్చిన ఆరోపణలను డేవిడ్ వార్నర్, మైకేల్ స్లేటర్ ఖండించారు. ఇవన్నీ ఊహాగానాలేనని వారు కొట్టిపారేశారు. ఇక వార్నర్ కూడా ఈ విషయంలో కాస్త ఘాటుగా స్పందించాడు. మా హోటల్ రూమ్స్ లో ఏమి జరుగుతుందో మీకు ఎలా తెలుస్తుంది? అక్కడ ఒకటి జరిగితే మీరు ఇంకోటి రాస్తే ఎలా? అని ప్రశ్నించాడు. కానీ.., గొడవకి గల కారణాలను మాత్రం వివరించలేదు. మరి.. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.