1981 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.. జింబాబ్వేను ఇంకా పసికూన జట్టుగానే పరిగణిస్తారు. ఆడిన తొలి వరల్డ్‌కప్‌లోనే ఆస్ట్రేలియాను ఓడించి.. పెద్ద టీమ్స్‌కు షాకిచ్చే జట్టుగా మిగిలిపోయింది జింబాబ్వే. కానీ.. 1992-2003 మధ్య కాలంలో మాత్రం.. ప్రపంచ దేశాలను భయపెట్టే జట్టుగా మారింది. అందుకు కారణం.. ఈ పసికూన జట్టులో ఒక సింహం ఉండేది. ప్రపంచంలోని ఛాంపియన్ టీమ్స్‌లో ఉండే దిగ్గజ ఆటగాళ్లను తలదన్నుతూ.. తన బ్యాటింగ్ పవర్‌తో జింబాబ్వే పసికూన జట్టే అయినా.. వళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలనే విధంగా ప్రత్యర్థులను భయపెట్టాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్థాన్, ఇంగ్లండ్.. చివరికి భారత బౌలర్లకు సైతం చుక్కలు చూపించాడు.. అతనే ఆండీ ఫ్లవర్. పాతతరం క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే లెజెండరీ క్రికెటర్. ఇప్పుడు అతని గురించి తెలుసుకుందాం..
సౌతాఫ్రికా సంతతికి చెందిన ఆండీ.. 1992 ఫిబ్రవరీలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆ వెంటనే కొన్ని నెలల్లోనే ఇండియాతో మ్యాచ్‌లో టెస్టు క్రికెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. జట్టు పరంగా జింబాబ్వే పసికూన జట్టుగా పిలువబడుతున్నా.. ఆండీ ఫ్లవర్ మాత్రం అద్భుతమైన ఆటగాడిగా ఎదిగాడు. ప్రపంచ మేటి జట్లపై తన తిరుగులేని బ్యాటింగ్ స్కిల్స్‌తో పరుగుల వరద పారించాడు. భారత్‌తో ఆడిన తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అక్కడి నుంచి.. జింబాబ్వే క్రికెట్లో ఒక తిరుగులేని ఆటగాడిగా మారిపోయాడు. ఫార్మాట్ ఏదైనా.. ఏ దేశంలో ఆడినా.. ఎలాంటి బౌలర్లను ఎందుర్కొన్నా.. ఫ్లవర్ మంచి ప్రదర్శనలు చేశాడు. జింబాబ్వేను ఓడించాలంటే ఆండీ ఫ్లవర్‌ను ఓడించాలనే విధంగా.. జట్టు మొత్తానికి వన్ మ్యాన్ ఆర్మీలా మారిపోయాడు. అతనికి తోడు సోదరుడు గ్రాండ్ ఫ్లవర్ సైతం జింబాబ్వే జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు.
2000వ సంవత్సరంలో ఆండీ ఫ్లవర్ కెరీర్ పీక్ ఫామ్‌లో కొనసాగాడు. టీమిండియాపై నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. అంతకు ముందు ఢిల్లీలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 183(నాటౌట్), రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి దుమ్మురేపాడు. నాగ్‌పూర్‌లో తొలి ఇన్నింగ్స్‌లోనూ 55 పరుగులతో రాణించాడు. ఇలా టీమిండియాపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించాడు. శ్రీనాథ్, అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ లాంటి బౌలర్లకు చుక్కలు చూపించాడు. టెస్టుల్లో ఒక వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు 232 రికార్డు సైతం ఆండీ పేరునే ఉంది. ఆండీ ఫ్లవర్‌ను అవుట్ చేసేందుకు టీమిండియా బౌలర్లతో పాటు ప్రపంచ మేటి బౌలర్లు సైతం తలలుపట్టుకునే వారు. బౌలర్లను ఇంతలా ఇబ్బంది పెట్టిన పసికూన జట్టు ఆటగాడు మరొకడు లేడు.
అలాగే వన్డేల్లోనూ ఆండీ అద్బుతంగా ఆడేవాడు. తన వన్డే కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 145 కూడా ఇండియాపైనే బాదాడు. 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోలంబోలో జరిగిన మ్యాచ్‌లో ఆండీ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 164 బంతుల్లో 13 ఫోర్ల 145 పరుగులు చేసి, విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. కానీ.. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో.. జింబాబ్వేకు ఓటమి తప్పలేదు. కానీ.. ఆండీ ఫ్లవర్ పోరాటంపై మాత్రం సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. లెఫ్ట్ హ్యాండర్‌గా ఆఫ్ సైడ్ కవర్ డ్రైవ్‌లు అద్భుతంగా ఆడే ఫ్లవర్.. రివర్స్ స్వీప్‌లు సైతం ఆడేవాడు. ఫుల్ షాట్లు సైతం పర్ఫెక్ట్గా ఆడుతూ.. అప్పటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లలో నంబర్ ప్లేయర్‌గా ఉండేవాడు. పైగా.. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా.. నిలబడితే, చివరి వరకు అగ్రెసివ్ బ్యాటింగ్ చేసేవాడు. ఇప్పటికీ చాలా మంది స్టార్ క్రికెటర్లలో సైతం ఈ క్వాలిటీ లేదు. ప్రపంచ మేటి వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లుగా పేరుగాంచిన శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగార్కర, ఎంఎస్ ధోని సైతం.. లాంగ్ ఇన్నింగ్స్ ఆడిన సమయంలో చాలా టైమ్ తీసుకుంటూ ఆడారు. కానీ.. ఆండీ మాత్రం.. మంచి స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసేవాడు.
11 ఏళ్ల పాటు కెరీర్‌ను అద్భుతంగా కొనసాగించిన ఆండీ.. జింబాబ్వే జట్టుకు సైతం తన హాయంలో స్వర్ణయుగం అందించాడు. పసికూన జింబాబ్వే అనే చిన్నచూపును దూరం చేశాడు. ఆ తర్వాత 2002-03 మధ్య కాలంలో జింబాబ్వే బోర్డుకు ఆటగాళ్లకు మధ్య చెలరేగిన వివాదాలతో ఆండీ ఫ్లవర్ తన కెరీర్‌కు ముగింపుపలకాల్సి వచ్చింది. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆండీ.. ఆ తర్వాత కోచింగ్ వైపు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తొలుత ఇంగ్లండ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన ఆండీ.. తక్కువ కాలంలోనే ఇంగ్లండ్ జట్టుకు టీమ్ మేనేజర్‌గా మారిపోయాడు. ఆండీ హాయంలోనే ఇంగ్లండ్ వరుసగా రెండు యాషెస్ సిరీస్‌లు సైతం గెలిచింది.
క్రికెటర్‌గా అద్భుతమైన కెరీర్‌ను కొనసాగించిన ఆండీ ఫ్లవర్.. కేవలం జింబాబ్వే లాంటి పసికూన జట్టులో ఉండిపోవడం వల్ల అతనికి దక్కాల్సిన గుర్తింపు కంటే చాలా తక్కువే దక్కిందని చెప్పాలి. జింబాబ్వే లాంటి పసికూన జట్టులో ఉండి కూడా ఆండీ ఫ్లవర్ భారీ స్టార్ డమ్ సాధించాడు. కానీ.. అదే ఒక పెద్ద జట్టులో ఉండి ఉంటే.. వరల్డ్ కప్ ఫైనల్స్ లాంటి మెగా ఈవెంట్స్‌లో ఆడి, ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే అవకాశాల దక్కేవి. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ధోని ఆడిన ఇన్నింగ్స్ చిరకాలం గుర్తుండి పోతుంది. ఎందుకంటే.. అది వరల్డ్ కప్ ఫైనల్ కాబట్టి. అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడే సత్తా ఆండీ ఫ్లవర్లో వంద రెట్టు ఎక్కువగానే ఉంది. కానీ.. జట్టు పరంగా మద్దతు లేకపోవడంతో.. ఆండీ ఫ్లవర్‌కు అలాంటి అవకాశం రాలేదు. అందుకే.. ఆండీ, ఆస్ట్రేలియాలోనో, ఇండియాలోనో పుట్టి ఉంటే.. అతను ఈ రోజు ఒక దిగ్గజ ఆటగాడిగా కీర్తించబడేవాడు. ఇప్పటికైనా.. ఆండీ ఫ్లవర్ ఒక లెజెండరీ క్రికెటర్. కానీ.. పెద్ద జట్లకు ఆడి ఉంటే.. మరింత పేరు, ప్రఖ్యాతలు దక్కేవి. అయినా.. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లకు లభించే సౌకర్యాల్లో సగం కూడా అందని జింబాబ్వే నుంచే ఆండీ ఫ్లవర్ అలా ఆడితే.. ప్రస్తుతం బీసీసీఐ ఆటగాళ్లను పువ్వులో పెట్టుకుని చూసుకున్నట్లు ఆండీని చూసుకుని ఉంటే.. ఇంకెన్ని అద్భుతాలు సృష్టించే వాడో కదా.