తండ్రికి తగ్గ తనయుడు.. అనిపించుకోవాలంటే.. తండ్రి వారసత్వాన్నే కొనసాగించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొడుకు వేరే రంగంలో తనదైన ప్రతిభ చూపించి తండ్రి పేరును నిలబెట్టడం మనం చూశాం. ఇక వారసత్వం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది సినిమా రంగం. ఇండస్ట్రీలో తండ్రి వారసత్వాన్ని స్వీకరించి రాణిస్తున్న హీరోలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి వారసత్వాన్ని కొనసాగించడం క్రికెట్ లో చాలా అరుదనే చెప్పాలి. ఈ క్రమంలోనే పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కొడుకు.. అలీ రజాక్.. పాకిస్థాన్ జూనియర్ లీగ్ లో ఆడుతూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన దైన షాట్లతో తండ్రిని గుర్తుకు తెస్తున్నాడు.
అబ్దుల్ రజాక్.. 17 సంవత్సరాల వయసులోనే పాకిస్థాన్ జట్టులో చోటు దక్కించుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ప్రారంభంలో బౌలర్ గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రజాక్.. ఆ తర్వాత క్రమంగా బ్యాటింగ్ పై కూడా పట్టు సాధించి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్ రౌండర్ గా ఎదిగాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి పాక్ జట్టుకు మరపురాని విజయాలను అందించాడు. ఈ క్రమంలోనే పాక్ – భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటే.. అందరి చూపు రజాక్-సచిన్ మీదే. ఎందుకంటే వీరిద్దరి టగ్ ఆఫ్ వార్ అలా ఉండేది. ప్రపంచ అత్యుత్తమైన బ్యాటర్ మధ్య, అత్యుత్తమైన బౌలర్ మధ్య యుద్ధం అంటే.. చూసే వారికి కూడా ఉత్కంఠ ఉంటుంది. ఒకానోక దశలో సచిన్ మాట్లాడుతూ..”నేను ఎదుర్కొన్న బౌలర్లలో మెగ్రాత్, అండర్సన్, బ్రెట్ లీ తర్వాత అత్యంత కఠినమైన బౌలర్ అబ్దుల్ రజాక్” అని పేర్కొన్నాడు. సచిన్ ను రజాక్ వన్డేల్లో 6 సార్లు అవుట్ చేశాడు.
ఈ క్రమంలోనే అబ్దుల్ రజాక్ తన కొడుకును కూడా క్రికెటర్ ను చేశాడు. పాకిస్థాన్ లో ప్రస్తుతం పాకిస్థాన్ జూనియర్ లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో స్థానిక జట్లు అయిన అండర్-19 జట్లు పాల్గొంటున్నాయి. అందులో భాగంగానే తాజాగా భహవల్పూర్ రాయల్స్ వర్సెస్ మార్దాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రాయల్స్ జట్టు తరపున బ్యాటింగ్ కు దిగిన అలీ రజాక్ చూడముచ్చటైన షాట్లు కొడుతూ.. తన టీమ్ కు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా గానీ ఓపికగా బ్యాటింగ్ చేస్తూ.. తండ్రి రజాక్ ను గుర్తు చేశాడు. అలీ రజాక్ ఈ మ్యాచ్ లో స్టైలీష్ ఆటతో మెప్పించాడు. అయితే తండ్రీ కొడుకులు క్రికెటర్లుగా ఉన్న సంఘటనలు చాలానే జరిగాయి. సచిన్ టెండుల్కర్-అర్జున్ టెండుల్కర్, జానీ బెయిర్ స్టో-జానీ, యువరాజ్ సింగ్-యోగ్ రాజ్, మార్ష్ ఫ్యామిలీ.. మిచెల్ మార్ష్, షాన్ మార్ష్ ఇంకా కొంత మంది క్రికెటర్స్ తండ్రి కొడుకులుగా జట్టుకు సేవలు అందించారు. ఇక ఈ మ్యాచ్ లో అలీ 43 బంతుల్లో 44 పరుగులు చేశాడు. దాంతో రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 145 పరుగులు చేసింది. అనంతరం మర్దన్ వారియర్స్ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసి విజయం సాధించింది.