వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు పార్టీ మారబోతున్నారా?.. వైఎస్సార్ సీపీనుంచి జనసేన పార్టీలో చేరబోతున్నారా? అసలు బాపట్ల జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది?...
అధికార వైఎస్సార్ సీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీపై విమర్శలు చేసి రెబల్స్‌గా మారిపోయారు. తాను టీడీపీలో చేరబోతున్నట్లు కోటంరెడ్డి హింట్ కూడా ఇచ్చేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల కారణంగా ఇబ్బందులు పడుతున్న వైఎస్సార్ సీపీకి మరో దెబ్బ తగిలింది. వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుకు సంబంధించిన ఓ వార్త ఒకటి వైఎస్సార్ సీపీలో కలకలం సృష్టిస్తోంది ఆమంచి స్వాములు వైఎస్సార్ సీపీని విడిచి జనసేన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీల్లో ఆమంచి ఫొటోలు ఉండటం ఈ ప్రచారానికి తెరతీసింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం పందిళ్లపల్లెలో జనసేన పార్టీకి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పార్టీ మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు అవి. ఆ ఫ్లెక్సీలపై వంగవీటి మోహన రంగ, పవన్ కల్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్ ఫొటోలు ఉన్నాయి. వాటితో పాటు ఆమంచి స్వాములు ఫొటోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆమంచి స్వాములు తన సోదరుడితోనే అధికార పార్టీలో ఉన్నారు. ఇలా, ఆయన ఫొటోలు జనసేన పార్టీ ఫ్లెక్సీలపై కనిపించటంతో చర్చ మొదలైంది.
ఆమంచి స్వాములు పార్టీ మారనున్నారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒక వేళ ఆమంచి స్వాములు పార్టీ మారతారన్న వార్తలు నిజమైతే.. అన్నను విడిచి ఒక్కడే జనసేనలో చేరతారా? లేక ఆమంచి కృష్ణమోహన్ కూడా జనసేనలో చేరతారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే.. ఆమంచి సోదరులనుంచి స్పందన రావాల్సిందే. మరి, అధికార వైఎస్సార్ సీపీ కలకలం సృష్టిస్తున్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.