వైఎస్సార్ పేరు తలుచుకోగానే 108 ఉచిత అంబులెన్స్‌లు కుయ్ కుయ్ మంటూ పరుగుపెడుతున్న శబ్ధం మనసుకు వినిపిస్తుంది. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ వారసురాలిగా తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించిన వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం క్రిష్టారాయపల్లిలో పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన తన క్యాంపు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి.
వెంటనే స్పందించిన షర్మిల తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న 108 అంబులెన్స్‌లకు ఫోన్ చేసిన రాకపోవడంతో ఆలస్యం అవుతుండడంతో ఆమె తన అంబులెన్స్ ఇచ్చి ఆస్పత్రికి పంపించారు. వెంటనే స్పందించి బాధితులను ఆదుకున్న తీరును అక్కడి వారు ప్రశంసించారు. వైఎస్ కూతురంటే ఆ మాత్రం జాలి గుండె ఉంటుందని చెప్పుకున్నారు.