గత కొద్ది రోజుల నుండి ఏపీ రాష్ట్ర రాజకీయాలు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చుట్టు తిరుగుతున్నాయి. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. అయితే మరోసారి కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తలుచుకుంటే తనను ఏమైనా చేస్తుందని, అవసరమైతే తనను ఎన్ కౌంటర్ కూడా చేయొచ్చు అంటూ కోటంరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతకొద్ది రోజుల నుంచి సొంత ప్రభుత్వంపై పలు రకాల ఆరోపణలు చేశారు. తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని, సొంత పార్టీవారేఅలా చేయడంతో తాను మానసికంగా బాధపడ్డానని తెలిపారు. ఇటీవల వరుసగా మీడియాతో మాట్లాడుతున్న కోటంరెడ్డి అనేక ఆసక్తిర విషయాలు తెలిపారు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ ప్రసారమవుతున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన రాజకీయ ప్రస్థానం గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “నేను జగన్ మోహన్ రెడ్డికి, వారి కుటుంబానికి వీరవిధేయుడను, జగన్ మోహన్ రెడ్డి గారికి ఎవరు లేనప్పుడు నేనున్నాను, ఓదార్పు యాత్రలో ఉన్నాను. అలాంటి నాకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. అయిన భరించాను, ఓర్చుకున్నాను. ఈ రోజు నా ఫోన్ ట్యాపింగ్ చేసే పరిస్థితే వచ్చిందంటే, ఇలాంటి పరిస్థితిలో అక్కడ ఉంటం మంచిది కాదని అనుకున్నాను. నా దృష్టిలో జగన్ గారిని ఓ నాయకుడిగా చూడలేదు. ఒక నెల్సన్ మండేలా, చేగువేరాలా, ఓ భగత్ సింగ్ లా ఆరాధించాను. అమరావతి రైతులను పరామర్శించడంతో నాకు వైసీపీలో కష్టాలు వచ్చాయని క్రమేణా అనుభవంతో తెలిసింది.
నేను వేరే పార్టీ లో ఉండి ఉంటే నా ఫోన్ ట్యాపింగ్ జరిగిన బాధపడే వాడిని కాదు. అధికారం మదం పట్టిన ఓ రాజకీయ నేతగా తప్పులు చేసిన మాట వాస్తవం. అలానే నేను ఓ సగటు రాజకీయ నాయకుడిలాగా ప్రవర్తించాను. 21 ఏళ్ల వయస్సులోనే అనేక రకాల కేసులు, లాకప్ లోకి వెళ్లడం జరిగింది. ప్రభుత్వాలు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాయి. సత్కారాలే కాదు.. ఎన్ కౌంటర్ కూడా చేయవచ్చు. అయితే అన్నిటి సిద్ధమయ్యే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి.. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.