నారా లోకేశ్.. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు. మాజీ మంత్రి. ఇంతే లోకేశ్ గురించి చెప్పుకోవడానికి నిన్న మొన్నటి వరకు ఇంతకన్నా పెద్దగా న్యూస్ ఉండేది కాదు. మహా అయితే.., ఆయన స్పీచ్ లో తప్పులు దొర్లితే ఆన్లైన్ లో ట్రోల్స్ నడిచేవి. అంతకు మించి లోకేశ్ తన ప్రత్యేకతని చాటుకుంది కూడా లేదు. కానీ.., అదంతా గతం. ఇప్పుడు నారా లోకేశ్ నయా రాజకీయాన్ని మొదలు పెట్టారు. నువ్వు ఎంత అంటే..? నీ తలదన్నే అంత అన్నట్టు తన ప్రవర్తనలో మార్పు చూపిస్తున్నారు. ఇదంతా కూడా 2019 ఎన్నికల్లో వచ్చిన పరాభవం నుండి వచ్చిన పాఠమే.
ఇంతకాలం తనపై జోకులు వేసుకున్న వారే ఆశ్చర్యపోయేలా లోకేశ్ నడక, నడత, మాటలో తేడా వచ్చింది. ఆఖరికి తన ఫిజిక్ విషయంలో కూడా ఆయన చేంజ్ తీసుకొచ్చారు. ఇక మాట్లాడే భాషలోను పదును పెంచారు. తాజాగా కర్నూలులో జరిగిన ప్రెస్ మీట్ ఇందుకు వేదిక అయ్యింది. కర్నూలు టీడీపీ నేతలైన నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఈ శుక్రవారం ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకి గురి అయ్యారు. వారి కుటుంబాలను నారా లోకేశ్ పరామర్శించాడు. ఈ సందర్భంగా లోకేశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచాయి.
ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం బదులు.., రాజా రెడ్డి రాజ్యంగం అమలవుతోంది. ఈరోజు కొన్ని కుక్కలు మా నాయకులను దారుణంగా చంపి మొరుగుతున్నాయి. ఆ కుక్కలను హెచ్చరిస్తున్నా. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిని వైసీపీ వాళ్ళు పశువుల్లా నరికి చంపారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో 27 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. 400 మందిపై దాడి చేశారు. వీటిని నేను వ్యక్తిగాంతంగా తీసుకుంటున్నా. ఎవ్వరిని వదలను వడ్డీతో సహా చెల్లిస్తా అని లోకేశ్ ఆవేశంగా మాట్లాడారు.
చనిపోయిన నాగేశ్వర్ రెడ్డి లైసెన్సుడు గన్ ఉంది. కానీ.., ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక దాన్ని రెన్యూల్ చేయలేదు. గన్ ఇచ్చి ఉంటే ఈ దారుణం జరిగేది కాదు. మా నేతలను చంపిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు. రాజా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే చేశారు. కానీ.., చివరికి ఏమయ్యారు? జగన్ నీకు దమ్ముంటే ఈ హత్యలపై సీబీఐ విచారణకి ఆదేశించు. నువ్వు మగాడివైతే నా సవాలు స్వీకరించు అంటూ లోకేశ్ రెచ్చిపోయారు. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు మేము ఇలాంటి రాజకీయం చేసుంటే మీరు పాదయాత్ర చేసుండేవాళ్ళా అని లోకేశ్ ప్రశ్నించారు. ఇక నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు.