ఒక పక్క సినిమాలు చేస్తూ.. మరోపక్క రాజకీయాలు చేస్తూ సినీ, రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి అంటే 2014 నుంచి 2023 వరకూ దాదాపు 9 ఏళ్ళు గడిచాయి. తొమ్మిదేళ్ల పాటు ఒక పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. రకరకాల వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయంతో వేల కోట్లు ఆస్తులు ఉన్న వారు మాత్రమే రాజకీయ పార్టీలను నడపగలరు అన్న టాక్ ప్రజల్లో ఉంది. అయితే వేల కోట్లు ఆస్తులు లేకపోయినా పార్టీని సమర్థవంతంగా నడపవచ్చునని, అందులో కూడా ప్రజల కష్టాలు తీరుస్తూ.. వారికి ఆర్థికంగా అండగా నిలబడుతూ పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి కాబట్టే పార్టీ నడపగలుగుతున్నారని కామెంట్స్ చేస్తారు. అయితే పార్టీ నడపడం కోసమే సినిమాలు చేస్తున్నా అని చెప్పినా కొంతమంది మాత్రం నమ్మరు.
అయితే ఈ విషయంపై నాగబాబు స్పష్టత ఇచ్చారు. ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కి ఎన్ని వేల కోట్లు ఆస్తులు ఉండచ్చు అని యాంకర్ అడగ్గా.. నాగబాబు సమాధానమిచ్చారు. ఏ సినిమా చేసినా ఆ వచ్చిన డబ్బుల్లో తను బతకడం కోసం కొంత ఉంచుకుని.. మిగతా డబ్బులు ప్రజలకే ఖర్చు పెట్టేస్తారని నాగబాబు అన్నారు. పార్టీ కోసమో, ప్రజల కోసమో, మిలిటరీ వాళ్ళ కోసమో, హుద్ హుద్ తుఫాన్ లాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చేస్తుంటారని అన్నారు. ఇండస్ట్రీలో కూడా ఎవరికైనా సహాయం కావాలంటే చేస్తారని, ఇప్పుడు రైతుల కోసం ఇచ్చారని, అంతకు ముందు ఇప్పటం ప్రజలకు, ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇచ్చారని అన్నారు. తనకు చేతనైనంత వరకూ డబ్బులు పంచుకుంటూ వెళ్తున్నారని అన్నారు. తన దగ్గర ఏదీ ఉంచుకోరని, పవన్ ఒక గివర్ అని అన్నారు. పవన్ కి సినిమా నుంచి వచ్చే ఆదాయం తప్ప వేరే వ్యాపారాలు లేవని అన్నారు.
కోట్లలో పారితోషికం తీసుకునే రోజుల్లో.. మాదాపూర్ లో ఎకరం లక్ష రూపాయలు ఉండేది. ఒక కోటి రూపాయలతో వంద ఎకరాలు కొనే సత్తా పవన్ కి ఉంది. కానీ కొనలేదు. కొని ఉంటే వేల కోట్ల ఆస్తి ఉండేదని అన్నారు. అంత ఆస్తి ఉంటే పోరాడడం కుదరదని, ప్రజల కోసం పోరాడే నాయకుడికి ఆస్తులు ఉంటే ఆస్తిని అడ్డుపెట్టుకుని ట్విస్ట్ చేస్తారని, అందుకే పవన్ కళ్యాణ్ ఆస్తులపై ప్రేమ పెంచుకోలేదని అన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తికి ఆస్తులు ఉండకూడదన్న గొప్ప ఆలోచన పవన్ దని అన్నారు. సినిమా అయిపోతే పవన్ దగ్గర డబ్బులుండవని, డబ్బులు కావాలంటే మళ్ళీ సినిమా చేస్తారని.. మిగతా నాయకుల్లా వ్యాపారాలు లేవని అన్నారు. పార్టీ కార్యకర్తలు ఇచ్చే ఫండ్స్, పవన్ కళ్యాణ్ పారితోషికం ఇవే పార్టీని నడుపుతున్నాయని.. ఈ డబ్బుతోనే ప్రజల కోసం ఖర్చు పెడతారని అన్నారు. వేరే ఆదాయ మార్గం అయితే లేదని స్పష్టం చేశారు.
అసలు పవన్ కళ్యాణ్ కి ఆస్తులే లేవా అని యాంకర్ అడగ్గా.. ప్రస్తుతం పవన్ ఉంటున్న ఇల్లు ఫైనాన్స్ లో ఉందని అన్నారు. ఇక శంకరపల్లిలో 15 లక్షలో, 16 లక్షలో పెట్టి ఒక ల్యాండ్ కొన్నారని.. అది కూడా ఆస్తులు కూడబెట్టడం కోసం కాదని, వ్యవసాయం చేయాలన్న ఆసక్తితో కొన్నారని అన్నారు. అయితే ఆ ల్యాండ్ పెద్ద ఆస్తి ఏమీ కాదని అన్నారు. పవన్ కి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయని అన్నారు. ఇన్కమ్ టాక్స్ కూడా ఫైనాన్స్ చేసే కట్టారని అన్నారు. మరి పవన్ కి వేల కోట్ల ఆస్తులు లేవని, ఉన్న కొద్ది ఆస్తులు ఇంటితో సహా ఫైనాన్స్ లో ఉన్నాయని.. ఇటీవల టాక్స్ కట్టాల్సి వస్తే దానికి కూడా ఫైనాన్స్ చేసి కట్టారని నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.