MLC Anantha Babu: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంత బాబు కారులో డ్రైవర్ మృతదేహం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. డ్రైవర్ సుబ్రమణ్యం మృతికి సంబంధించి అనంతబాబే నేరం చేసినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది కలిగిస్తున్నాడనే కోపంతోనే సుబ్రమణ్యాన్ని హత్య చేసినట్లు అనంత బాబు నేరం ఒప్పుకున్నారని సమాచారం. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న ఆయన హత్య కేసులో జైలు పాలవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఆయన నేపథ్యం గురించే అంతటా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆయన నేపథ్యం ఏంటి? రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?.. ఎమ్మెల్సీగా ఎలా ఎన్నికయ్యారు?..
వైఎస్సార్ స్పూర్తితో రాజకీయాల్లోకి…అనంత సత్య ఉదయ భాస్కర్ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి చెందినవారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్సార్ వెంట నడిచారు. 2001లో ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగలనుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. అనంత బాబు 2001-2006 మధ్య కాలంలో జెడ్పీటీసీగా.. 2006-2011 మధ్య కాలంలో అడ్డతీగల మండల పరిషత్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో అప్పటి కాంగ్రెస్ పార్టీ సీటు ఇవ్వకపోవటంతో రెబెల్‌గా ఎమ్మెల్యే పదవికి నామినేషన్ వేశారు. అయితే, కుల ధ్రువీకరణ విషయంలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘‘వైఎస్సార్ సీపీ’’ పెట్టిన తర్వాత ఆ పార్టీలో చేరారు.
ఏజెన్సీ ప్రాంతంలో వైఎస్సార్ సీపీకి పట్టువచ్చేలా కృషి చేశారు. 2014,19 ఎన్నికల్లో ఎజెన్సీలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలవటానికి ఈయనే ముఖ్య కారణం. 2014లోనూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అనంత బాబు నామినేషన్ వేశారు. ఈ సారి కూడా కుల ధ్రువీకరణ విషయంలో నామినేషన్ తిరస్కరణకు గురైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా తన అనుచరులుగా ఉన్న వంతెల రాజేశ్వరి చేత నామినేషన్ వేయించారు. ఆమెను గెలిపించుకున్నారు. గత రెండు దశాబ్ధాలుగా రంపచోడవరంతో పాటు జిల్లా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంత బాబు డిసెంబర్ 17, 2021న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
ముత్తాతల నుంచి రాజకీయ కుటుంబమే..అనంత బాబుది రాజకీయ కుటుంబమే. 1965లో అనంత బాబు ముత్తాత పడాల వీర్రాజు.. 1975 మధ్యలో తాత అనంత వీర్రాజు.. 1982-87వరకు తండ్రి చక్రరావు అడ్డతీగల సమితి అధ్యక్షులుగా పని చేశారు. తండ్రి చక్రారావు సమితుల స్థానంలో ఏర్పడ్డ మండల పరిషత్ చైర్మన్‌గా 1987నుంచి 1989వరకు పనిచేశారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అనంత బాబు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో దశాబ్ధాల అనుభవం.. జిల్లా రాజకీయాల్లో తిరుగులేని పట్టు ఉన్న ఆయన కోపాన్ని అనుచుకోలేక హత్య చేయటంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అనంత బాబును కఠినంగా శిక్షించి, సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజలు ఏక కంఠంతో కోరుకుంటున్నారు. మరి, అనంత బాబు రాజకీయ జీవితం, హత్య నేరంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Vizag Srujana Case: వైజాగ్ సృజన ఆత్మహత్య.. ఈ పాపం ఎవరిది?