ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెదేపా నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అధికార పార్టీ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందంటూ ఘాటుగా స్పందించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారన్నారు. దాని విలువ రూ.8 వేల కోట్ల రూపాయలంటూ విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికినా.. దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయంటూ ఆరోపించారు. నర్సాపూర్ నుంచి డ్రగ్స్ ఆస్ట్రేలియాకి పంపే స్థాయికి పరిస్థితి చేరిందంటూ తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు ఇప్పుడు ఏపీలో దొరుకుతున్నాయంటూ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక బ్రాండ్లు ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ తరఫున అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇష్టానుసారంగా అమ్మడానికి ఇష్టానుసారంగా చేశారంటూ మండి పడ్డారు. మద్యపాన నిషేధం పేరుతో మూడు, నాలుగు రెట్లు రేట్లు పెంచేసి వ్యాపారం చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రేదేశ్ తయారు చేయడమే తమ లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదంటూ చంద్రబాబు ఆరోపించారు. ప్రశ్నిస్తున్నవారిపై దాడి చేస్తున్నారంటూ ఆక్షేపించారు. తెదేపా కార్యాలయాలు, పట్టాభి ఇంటిని ధ్వంసం చేశారన్నారు. తాజా పరిస్థితుల దృష్ట్యా ఏపీలో ఆర్టికల్ 356ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి జరగడం చరిత్రలో ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. పరిస్థితిని ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఫోన్ ఎత్తలేదని విమర్శించారు. టీడీపీ కార్యాలయాలపై దాడి ఘటనపై సీబీఐ విచారణ చేసేందుకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. డీజీపీని రీకాల్ చేయాలని.. ఆయన చేసిన తప్పులకు శిక్షించాలంటూ రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు. న్యాయం జరిగే వరకు వారి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దోషులను కఠింనంగా శిక్షించాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు.