రాయలసీమలోనే కాకుండా ఏపీ సహా తెలంగాణాలో కూడా విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి. బైరెడ్డి మాటలకి ప్రభవితమయ్యే అభిమానులు లక్షల మంది ఉన్నారు. వైసీపీలో యువజన నాయకుడిగా బైరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ కి మెంటల్ వచ్చేస్తుంది. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే. గుక్క తిప్పుకోకుండా సమస్యల మీద మాట్లాడగల వ్యక్తి బైరెడ్డి. తాజాగా బైరెడ్డి జర్నలిస్ట్ జాఫర్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా బైరెడ్డి నుంచి కీలక విషయాలు బయటపెట్టారు. తనను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలనుకున్నారో అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.
‘ఎన్కౌంటర్ చేయడానికి నేనేమైనా తీవ్రవాదినా? గన్ లు తీస్తారు. నెత్తిన పెడతారు. కాలుస్తామని, కొడతామని అంటారు. అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి నిద్ర లేపుతారు. గంటల కొద్దీ లాకప్ లోనే ఉంచుతారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? చంపడానికా? కాదు.. భయపెట్టడానికి. భయపెట్టడానికే ఇలా చేస్తారు. కానీ నేను భయపడను. ఇలాంటివి చాలా చూసాను. ఆ సమయంలో నేను వెనకడుగు వేస్తే ముందుకు వెళ్లనిచ్చేవారు కాదు. తొమ్మిది, పదేళ్ల కిందటే నాపై ఇలా చేసినప్పుడు ఎందుకొచ్చిన రాజకీయాలు అని అనుకోలేదు. అప్పుడు ఆగిపోయి ఉంటే బతకానిచ్చేవారు కాదు. నా కుటుంబం, అభిమానులు చాలా మంది నన్ను నమ్ముకుని ఉన్నారు. వారి కోసమే ఇంత దూరం వచ్చాను.
ఒకవేళ చనిపోయే సందర్భం వస్తే.. చనిపోయే ముందు అభిమానుల ముఖాలను గుర్తుపెట్టుకుని తలచుకుని మరీ చనిపోతా’ అని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి వెల్లడించారు. తానొక సామాన్యుడినని, అమాయకుడినని, తనలో ధైర్యం కూడా లేదని, కానీ కొన్ని పరిస్థితులు తనని ఇలా మార్చాయని అన్నారు. ప్రశాంతమైన జీవితం గడపాలని తనకు ఉంటుందని, తానెప్పుడూ సమస్యలను వెతుక్కుంటూ వెళ్లలేదని, ఇప్పటికీ ప్రశాంతంగా బతకాలని ఉంటుందని అన్నారు. తాను ఇప్పటి వరకూ ఏ పదవి ఆశించి పని చేయలేదని, తన పని నచ్చి జగన్ పదవులు ఇస్తున్నారని అన్నారు. ఇకపై కూడా పార్టీ కోసమే పని చేస్తా తప్పితే.. పదవుల కోసం కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ గురించి ఆలోచించేది లేదని, జగన్ సార్ ఏ పని చెప్తే ఆ పని చేస్తా అని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అన్నారు.