ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి విజయం శ్రీకాకుళంలో నమోదైంది. అధికార వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు అద్భుతమైన విజయం సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈనెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. వీటి కౌంటింగ్ గురువారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ఫలితం వెలువడింది. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయం సాధించింది. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఈ ఎన్నికల్లో 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికలు జరిగాయి. దాదాపు తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోని ఓటర్లు.. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ (తూర్పు రాయలసీమ), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి (పశ్చిమ రాయలసీమ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఇందులోని శ్రీకాకుళంకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి నర్తు రామారావు విజయం సాధించారు. మొత్తం ఓట్లలో రామారావుకు 632 ఓట్లు పోలవగా, పోటీలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థికి 108 ఓట్లు, చెల్లనివి 12 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ తొలి విజయం సాధించినట్లు అయింది.