కడప క్రైం- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుల్లో ఒకరైన వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి తన వాంగ్మూలంలో కీలక విషయాలను వెల్లడించాడు. ప్రొద్దుటూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో సీపీఆర్పీసీ 164 ప్రకారం దస్తగిరి ఆగస్టు 31న, ఆగస్టు 25న సీబీఐకి వాంగ్మూలం ఇచ్చాడు.
ఈ వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డిని చంపితే 40 కోట్లు ఇస్తారని, అందులో 5 కోట్లు నీకు ఇస్తానని వివేకా సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడు. వివేకా హత్య సమయంలో సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలు కూడా ఉన్నారని తెలిపాడు. ఫిబ్రవరి 10, 2019న గంగిరెడ్డి ఇంట్లోనే ఈ హత్యకు ప్లాన్ చేశారని చెప్పాడు. ఇలా పధకం వేసుకున్నాక నాలుగు రోజుల తర్వాత సునీల్ తనకు కోటి రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చినట్టు పేర్కొన్నాడు దస్తగిరి.
వైఎస్ వివేకానంద రెడ్డి ఓ రోజు హైదరాబాద్ నుంచి తిరిగివస్తూ ముద్దనూరు రైల్వేస్టేషన్ వద్ద తనను పికప్ చేసుకోమని నాతో చెప్పారని దస్తగిరి చెప్పాడు. తాను వెళ్లి ఆయన్ను తీసుకొస్తుండగా మార్గమధ్యలో గంగిరెడ్డికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడని తెలిపాడు. వివేకా ఇంటికి వెళ్లేసరికి అప్పటికే గంగిరెడ్డి ఇంట్లో ఉన్నాడని, ఆ తర్వాత ఆయనతో కలిసి కారులో వెళ్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను మీరు మోసం చేశారు.. నాకు అన్ని విషయాలు తెలిశాయి.. అంటూ గంగిరెడ్డిపై వివేకా మండిపడ్డారని దస్తగిరి వాంగ్మూలంలో చెప్పాడని తెలుస్తోంది.
కడపకు చెందిన రాధాకృష్ణమూర్తికి సంబంధించిన ఓ భూమి వ్యవహారాన్ని వివేకానందరెడ్డి, గంగిరెడ్డిలు కలిసి సెటిల్ మెంట్ చేశారని దస్తగిరి చెప్పాడు. ఈ సెటిల్‌మెంట్ పూర్తయ్యాక అందులో రావాల్సిన 8 కోట్లు వివేకా చేతికందాయని, గంగిరెడ్డి వివేకాను ఆ డబ్బుల్లో వాటా అడిగాడని చెప్పాడు. దీంతో గంగిరెడ్డిపై వివేకా ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి నుంచి వారిద్దరికీ మాటల్లేవని తెలిపాడు.
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు గంగిరెడ్డి తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి పిలిచారని చెప్పాడు. ఆ సమయంలో వివేకా మమ్మల్ని చూసి, ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని గంగిరెడ్డిని ప్రశ్నించాడు.. డబ్బుల విషయం మాట్లాడేందుకు వచ్చారంటూ గంగిరెడ్డి సమాధానమిచ్చాడు.. ఆ తర్వాత వివేకానంద రెడ్డి హాల్ నుంచి పడకగదిలోకి వెళ్లాడు. ఈ సమయంలో గంగిరెడ్డి బెంగళూరు సెటిల్‌మెంట్ డబ్బుల్లో తనకూ వాటా ఇవ్వాలని మరోసారి అడిగాడు.. సెటిల్‌మెంట్ చేసింది నేనైతే… నీకు వాటా ఎలా ఇస్తాను.. అని వివేకా గంగిరెడ్డిపై మళ్లీ సీరియస్ అయ్యాడు.
కాసేపు ఇద్దరికి వాగ్వాదం జరగడంతో సునీల్ వివేకాను అసభ్యంగా తిడుతూ ముఖంపై కొట్టాడు.. ఆయన వెనక్కిపడిపోయాడు.. ఉమాశంకర్‌రెడ్డి నా దగ్గరున్న గొడ్డలి తీసుకుని వివేకా తలపై కొట్టడంతో రక్తమోడుతూ క్రింద పడిపోయారు.. సునీల్ వివేకా ఛాతీపై ఏడెనిమిదిసార్లు బలంగా కొట్టాడు.. గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్ రెడ్డి డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతుకుతుండటంతో వివేకా వారిపై గట్టిగా అరిచారు.. దీంతో నేను ఆయన కుడి అరచేతిపై గొడ్డలితో కొట్టానని దస్తగిరి తన వాంగ్మూలంలో వివరించాడు.