న్యూ ఢిల్లీ- భారత దేశంపై విషపూరిత ప్రచారం చేస్తూ, తప్పుడు అంశాలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ చానల్స్ పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝులిపించింది. దేశంపై దుష్ప్రచారం చేస్తున్న 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్సైట్లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రకటించింది. నిఘా వర్గాల సహకారంతో సదరు యూట్యూబ్ చానల్స్, వెబ్ సైట్లను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ క్రమంలో 20 యూట్యూబ్ చానళ్లను నిలిపివేయాల్సిందిగా సోమవారమే యూట్యూబ్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు రెండు వెబ్సైట్లను సైతం బ్లాక్ చేయాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సూచించాలంటూ టెలికాం మంత్రిత్వశాఖను ఆదేశించింది. ఈ యూట్యూబ్ చానళ్లు, వెబ్సైట్లను పాకిస్థాన్‌కు చెందిన నెట్వర్క్ నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భారత్ కు సంబందించిన సున్నితమైన అంశాలపై ఈ చానళ్లు, వెబ్ సైట్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు తెలిపింది.
భారత సైన్యం, భారత్ లోని మైనారిటీ వర్గాలు, రామ మందిరం, కశ్మీర్ అంశం, దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తదితర అంశాలపై ఈ యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లు విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నయా పాకిస్థాన్ గ్రూప్- ఎన్పీజీ పేరిట ఏర్పాటైన యూట్యూబ్ నెట్వర్క్ ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు, ఈ చానళ్లన్నింటికీ కలిపి 35 లక్షలకు పైగా సబ్‌స్ర్కైబర్లు, వీటి వీడియోలకు 55 కోట్లకు పైగా వీక్షకులు ఉన్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలిపింది.
నిషేధం విధించిన యూట్యూబ్ చానళ్లలో ద పంచ్ లైన్, ఇంటర్నేషనల్ వెబ్ న్యూస్, ఖల్సా టీవీ, ద నేక్డ్ ట్రూత్, 48 న్యూస్, నయా పాకిస్థాన్ గ్లోబల్, గ్లోబల్ ఈ కామర్స్, జునైద్ హలీమ్ అఫీషియల్ తదితర 20 చానెళ్లు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యతిరేక వార్తలతో దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న 20 యూట్యూబ్ చానళ్లు, రెండు వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకున్నామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విటర్లో పేర్కొన్నారు.
We have taken action against cross border activities aimed to spread unrest in India by way of spreading fake news and propaganda. YouTube channels and web portals were violating domestic laws and strong action has been taken against them: Union I&B Minister @ianuragthakur pic.twitter.com/0gyyJahPfZ
— PIB India (@PIB_India) December 21, 2021