పెళ్లి చేసుకునేవారికి శుభవార్త. పెళ్ళి నిశ్చయించిన వెంటనే కల్యాణ శుభలేఖని ఇష్టదైవానికి పంపడం మన సంప్రదాయం. కొంతమంది శ్రీవారి దర్శనం చేసుకుని పాదపద్మాల ముందు శుభలేఖని పెడతారు. తిరుమల రాలేని భక్తుల కోసం టీటీడీ కొత్త ప్రణాళికను రూపొందించింది. చాలామంది తిరుమల శ్రీవారికి తమ ఇంట జరిగే వివాహ ఆహ్వాన పత్రిక పంపాలని కోరుకుంటారు. తిరుమల శ్రీవారికి శుభలేఖను ఎలా పంపాలి? ఇలాంటి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తోంది. ఎవరైనా ఇక తిరుమల శ్రీవారికి మొదటి శుభలేఖను పంపొచ్చు. అంతేకాదు శ్రీవారి నుంచి పెళ్లి కానుక అందుకోవచ్చు. ఇంట్లో పెళ్లి నిశ్చయం కాగానే మొదటి శుభలేఖను నెల ముందుగానే తిరుమలకు పంపొచ్చు. వెంటనే తిరుమల నుంచి విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులకు చేతి కంకణాలు, అక్షతలు వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుని ఆశీర్వచనాలతో బహుమతి పంపుతారు.
శ్రీవారి బహుమానం అందుకోవాలి అంటే ‘‘శ్రీ లార్డ్ వేంకటేశ్వర స్వామి, ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి’’ చిరునామాకు ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక కొరియర్ చేయొచ్చు.
కరోనా వేళలోనూ నూతన వధూవరులకు టీటీడీ ఈ అవకాశం కల్పిస్తోంది. టీటీడీ కల్పించిన ఈ అవకాశం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన కల్యాణమస్తులో ఒకటయ్యే జంటలకు అందించే తాళిబొట్టును ఒక గ్రాము నుంచి రెండు గ్రాములకు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే