తిరుపతి– మన దేశంలో పోలీసుల అధికారం ఎలా ఉంటుందో అందరికి తెలుసు. చిన్నపాటి కానిస్టేబుల్ కూడా తన అధికారాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతుంటాడు. ఇక పైస్థాయి పోలీసు అధికారుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోలీసులు అంటే జనంలో ఉన్న భయాన్ని చాలా మంది అధికారులు క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ కొంత మంది పోలీసు అధికారులు మాత్రం చాలా సింపుల్ గా, ప్రజలతో కలిసిపోతుంటారు.
ఇదిగో తాజాగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఎస్పీ తనదైన స్టైల్లో అందరిని ఆశ్చర్యపరిచారు. అసలేం జరిగిందంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి సోమవారం తిరుమలకు వచ్చారు. సీఎం పర్యటన అంటే పోలీసు భద్రత, ఆ హడావుడి ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే కదా. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుమల కొండ వరకు ఎక్కడా చిన్న తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పోలీసులంతా ముఖ్యమంత్రి బందోబస్తు పర్యవేక్షణలో ఫుల్ బిజీగా ఉన్నారు. తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, రేణిగుంట ఎయిర్ పోర్ట్ వద్ద సీఎం పర్యటన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇక్కడ ఆయన సామాన్యుడిలా వ్యవహరించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సీఎం బందోబస్తు సిబ్బందికి అందించిన భోజనం తీసుకున్న ఎస్పీ వెంకట అప్పల నాయుడు సామాన్యుడిలా ఓ చెట్టు కింద కూర్చొని తిన్నారు.
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎస్పీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎస్పీ సింప్లిసిటీకి పోలీసు అధికారులతో పాటు, ప్రజలు కూడా ఫిదా అయిపోయారు. సమయం చిక్కితే చాలు తమ అధికారాన్ని ప్రదర్శించాలనుకునే జిల్లా పోలీస్ బాస్ పదవిలో ఉండి కూడా, అందరిలాగే సిబ్బందికి ఇచ్చిన భోజనాన్ని అలా చెట్టు క్రింద కూర్చుని తినడం గ్రేట్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.