ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపు వైపు మనస్సు అలా లాగేస్తుంటుంది. చికెన్ తెచ్చుకుని వెంటనే వండుకుని తినేయాల్సిందే. అయితే చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆచి తూచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఓ చికెన్ షాపు యజమాని కేవలం 5 పైసలకే చికెన్ అందిస్తానని ప్రకటించాడు .
మాంసాహార ప్రియులు ఎక్కువగా ఇష్టపడి తినేది చికెన్. ఆదివారం నుండి శనివారం వరకూ కూడా తినేవాళ్లు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఆదివారం వస్తే చాలు కంచంలో ముక్కలు కనిపించాల్సిందే. చికెన్‌తో అనేక వంటలు చేసి లాగించేస్తారు. ముక్క లేందే ముద్ద దిగదు కొందరికీ. రోజు తినాలని ఉన్న ప్రస్తుతం పెరుగుతున్న చికెన్ ధరల కారణంగా కొన్ని రోజులకే పరిమితం చేసుకుంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. రేటును బట్టి చికెన్ కొలత ఉంటుంది. అయితే నెల్లూరుకు చెందిన ఓ యజమాని చికెన్ ప్రియులకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం చెల్లు కాని నాణేలకు చికెన్ ఇస్తానని ప్రకటించడమే కాదూ.. అందించాడు కూడా.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని ఆత్మకూరు పట్టణలంలో షఫీ అనే వ్యక్తి 786 పేరుతో చికెన్ షాపు నిర్వహిస్తూ ఉంటాడు. గత 12 ఏళ్లుగా షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఆ షాపు ప్రమోషన్లలో భాగంగా ఆదివారం నాడు తన చికెన్ షాపులో ఐదు పైసలకు అర కిలో చికెన్ ఇస్తానని ప్రకటించాడు. ఆత్మకూరులో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాడు. ఇంకేముందీ ఆత్మకూరు పట్టణంతో పాటు ఆ చుట్టూ ప్రక్కల ప్రజలు సైతం ఐదు పైసల నాణాలను తీసుకు వచ్చి ఆ షాపు ముందు క్యూ కట్టారు. ఆదివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్‌తో చికెన్ అందించారు.
ఐదు పైసలకు అరకేజీ చికెన్ అంటూ షాపు వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశారు. ఒక ఐదు పైసలు బిళ్ళకు అరకేజీ చొప్పున ఒక మనిషికి రెండు బిళ్లలు తీసుకు వస్తే కేజీ చికెన్ ఇచ్చే విధంగా ప్రకటన చేయడంతో చాలామంది తమ వద్ద దాచుకొన్న ఐదు పైసల బిళ్ళలను తీసుకొని షాపు వద్దకు క్యూ కట్టారు. ఈ ఆఫర్ పెట్టడంపై షాపు యజమానులు షఫీ, అహ్మద్ లు మాట్లాడుతూ.. పురాతన నాణాలను గుర్తు తెచ్చేందుకు ఆఫర్ పెట్టినట్లు తెలిపారు. భారీగా స్పందన రావడంతో ఐదు పైసల బిళ్లలు తీసుకుని జనం వచ్చారని తెలిపారు. తాము చికెన్ షాపు నడిపి 12 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఈ ఆఫర్ పెట్టామని, ఇకపై పెడుతుంటామని తెలిపారు. ఏదీ ఏమైనప్పటికీ ఈ ఆఫర్ తో ప్రజలు ఖుషీ అయ్యారు. మరీ మీ ఊరిలో కూడా ఇటువంటి ఆఫర్ ఉండాలని భావిస్తే కామెంట్స్ సెక్షన్లలో తెలియజేయండి.