దేశ భద్రత కోసం అహర్నిశలు పహారా కాస్తుంటారు సైనికులు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. భార్యా, బిడ్డలను వదిలేసి, ఎండ, వాన, చలి లెక్కచేయకుండా దేశ పౌరుల కోసం సరిహద్దుల్లో కష్టపడుతున్నారు. అటువంటి సైనికుడు.. తాను చనిపోయినా మరొకరి ప్రాణం పోశారు.
దేశ పౌరుల సంరక్షణ కోసం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుంటారు సైనికులు. శత్రువుల గుండెలను గడగడలాడించే సైనికులు.. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా దేశ భద్రత కోసం అహర్నిశలు పహారా కాస్తుంటారు. దేశం కోసం ప్రాణాలు విడుస్తారు. శత్రువుల ప్రాణాలు తీయడమే కాదూ పోయగమని నిరూపించారో సైనికుడు. సైనికుడిగా దేశానికి సేవలందించడమే కాకుండా మరణంలోనూ ఆ స్ఫూర్తిని నింపారు. చనిపోతూ కూడా మరొకరికీ ప్రాణ దానం చేశారు. మరికొంత మందికి ప్రేరణగా నిలుస్తున్న ఈ నిజ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. మరొకరి ప్రాణాలను కాపాడేందుకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చర్యను ప్రధాని మోడీ సైతం కొనియాడారు.
వివరాల్లోకి వెళితే 40 ఏళ్ల ఆర్మీ వెటరన్ ఫిబ్రవరి 8న స్వస్థలానికి వస్తూ మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయాన్ని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ జవాన్ కోరిక మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. వైద్యులు ఆయన గుండెను సేకరించి, భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి పూణేకు తరలించారు. మహారాష్ట్రలోని పూణే ఆర్మీ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో సైనికుని భార్యకు ఈ గుండెను అమర్చేందుకు సిద్ధమయ్యారు.
దీని నిమిత్తం గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు. పూణే ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో 4 గంటల్లోనే ఆర్మీ ఆసుప్రతికి గుండెను తరలించారు. పూణేలోని ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియో థొరాసిక్ సైన్సెస్ వైద్యుల బృందం.. అనారోగ్యంతో ఉన్న సైనికుడి భార్యకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇండియన్ ఆర్మీ సదరన్ కమాండ్ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సైనికుని భార్య ప్రాణాలను కాపాండేదుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ప్రధాన మోడీ కొనియాడారు. గ్రీన్ కారిడార్ ద్వారా కొన్ని గంటల్లోనే గుండెను తరలించడంపై ‘ప్రశంసనీయమైన ప్రయత్నం’గా అభివర్ణించారు.
Commendable effort. I appreciate all those involved in this. https://t.co/QLEAaGpccS
— Narendra Modi (@narendramodi) February 15, 2023