న్యూ ఢిల్లీ- ప్రతి రోజు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మొన్నా మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీల రోజు వారి రివ్యూలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో
పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతకంతకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం కోసం అమెరికా, జపాన్ వంటి ఇతర దేశాల తరహాలోనే అత్యవసర వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును వెలికి తీయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ అధికారి తెలిపారు.
భారత్, జపాన్ తో సహా ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థ గల దేశాల సహకారంతో ముడి చమురు అత్యవసర స్టాక్‌ను విడుదల చేయడానికి అమెరికా సమాయుత్తం అయ్యింది. అత్యవసర చమురు నిల్వల కేంద్రాల నుంచి ముడి చమురును విడుదల చేయాలని అమెరికా ఈ దేశాలను కోరినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదే గనుక జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంద ని తెలుస్తోంది.
భారత్ లోని తూర్పు, పశ్చిమ తీరంలో మూడు ప్రదేశాలలో ఉన్న భూగర్భ చమురు కేంద్రాలలో సుమారు 38 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురును నిల్వలు ఉన్నాయి. ఇందులో నుంచి దాదాపు 5 మిలియన్ బ్యారెల్స్ విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ 7 నుంచి 10 రోజులలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. వ్యూహాత్మక చమురు నిల్వలకు పైప్ లైన్ ద్వారా అనుసంధానించిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ లకు స్టాక్స్ విక్రయించనున్నారు.