కరోనా వ్యాప్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి కరోనా సోకినా ప్రాణాలకు ప్రమాదమే ఉండదు. కరోనా ఒకసారి సోకి కోలుకున్నాక మళ్లీ వ్యాపిస్తోంది. చిన్న పెద్ద అనే వయస్సుతో తేడా లేకుండా అందరిలోనూ కరోనా వ్యాపిస్తోంది. అయితే బ్లడ్ గ్రూపుల్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఆధారపడి ఉంటుందనేది రీసెంట్ గా అధ్యయనాలు చెబుతున్న మాట. సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతున్నట్లు గుర్తించారు. ‘ఒ’బ్లడ్ గ్రూప్ వారికి కూడా ఎక్కువగానే సోకుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు.
వైరస్ గురించి వేర్వేరు అంశాలు ప్రచారంలో ఉన్నాయి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారికి కరోనా వైరస్ సోకదని లేదా ప్రభావం చూపించదని ఇప్పటివరకూ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు వివిధ యూనివర్శిటీ పరిశోధనల్లో ఒకే విషయం స్పష్టంగా తెలుస్తోంది. బ్లడ్ గ్రూపుల్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఉంటుందనేది కొత్త విషయం. ఈ అధ్యయనానికి యునైటెడ్ కింగ్‌డమ్ బ్రిటిష్ మెడికల్ మెడ్రివ్ జర్నల్ గుర్తింపు దక్కింది.
రోగ నిరోధక శక్తి ఒక్కటే కాదు బ్లడ్ గ్రూప్ సైతం కరోనా వైరస్ ను ప్రభావితం చేయగలదు. కొన్ని రకాల బ్లడ్ గ్రూపులు బలహీనంగా ఉంటే మరి కొన్ని శక్తివంతంగా ఉండటమే దీనికి కారణం. కరోనా వైరస్ మొదటి, రెండు వేవ్‌ల సమయంలో సూర్యాపేట మెడికల్ కాలేజీలో కొవిడ్ చికిత్స పొందిన 200 మంది రోగుల రక్త నమూనాలను పాథాలజీ వైద్య బృందం సేకరించింది.