ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై రాజకీయ వర్గాల నుంచే కాక.. సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో తాజాగా యూనివర్శిటీ పేరు మార్పు నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. యూనివర్శిటీ పేరు మార్పుకు గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ఆధారంగా ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ప్రభుత్వ చర్యలతో న్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు కాస్త… డాక్టర్ వైఎస్సార్‌హెల్త్ యూనివర్శిటీగా అధికారికంగా మారింది. ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఈ మేరకు జీఓ విడుదల చేసింది.
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరు మార్చి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టాలంటూ ప్రభుత్వం సెప్టెంబరు 21న బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి అసెంబ్లీ, శాసనమండలి ఆమోదం తెలిపిన తర్వాత బిల్లును గవర్నర్‌కు పంపించారు. తాజాగా గవర్నర్ దీనికి ఆమోద ముద్ర వేశారు. ఇక దేశంలో మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. 1996లో ఎన్టీఆర్ మరణం తర్వాత విశ్వవిద్యాలయానికి ఆయన గౌరవార్థం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా నామకరణం చేశారు. ఇక 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. యూనివర్శిటీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చారు. తాజాగా దీని పేరు డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మారింది.