ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం గురించి కిందటి ఏడాది రకరకాల పుకార్లు వినిపించాయి. ఒక టైంలో కిమ్ చనిపోయాడనే వార్తలు ప్రపంచానికి ఎంతో ఆసక్తిని కలిగించాయి. వారం తిరగకముందే మీడియా ముందు ప్రత్యక్షమై తాను నిక్షేపంగా ఉన్నానని శత్రు దేశాల గట్టి సందేశం పంపాడు కిమ్. నియంతలకే నియంతగా ముద్రపడ్డ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎప్పుడు ఏ వార్త బయటకొచ్చినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంది. కిమ్‌కి సంబంధించిన బాహ్య ప్రపంచానికి లీకైన ఓ సమాచారం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గి చిక్కిపోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అనారోగ్య సమస్యల కారణంగానే కిమ్ చిక్కిపోయారా, బరువు తగ్గారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కొరియాలోని సియోల్ మీడియా హౌస్‌ల ద్వారా ఈ ఫోటోలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్ మునుపటిలా బరువైన శరీరంతో కాకుండా స్లిమ్‌గా కనిపించారు. ఆయన చేతికి అత్యంత ఖరీదైన స్విస్ వాచ్ ఆ ఫోటోల్లో కనిపించింది. గతేడాది లీకైన ఫోటోల్లోనూ ఈ వాచ్ కనిపించింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆ వాచ్ ఆయన చేతికి అంత టైట్‌గా కనిపించలేదు. ఆయన బరువు తగ్గారని చెప్పేందుకు అంతర్జాతీయ మీడియాలో దీన్నో ఉదాహరణగా చెబుతున్నారు. కిమ్ జోంగ్ ఉన్ నవంబర్,2021లో 140 కేజీల బరువుతో ఉన్నట్లు తెలుస్తోంది.
2011లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కేజీల బరువు పెరిగారు. అప్పటినుంచి ఆయన్ను అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయన్న ప్రచారం ఉంది. గతేడాది కొద్ది నెలల పాటు ఆయన కనిపించకుండా పోయిన సమయంలో తీవ్ర అనారోగ్యమే ఇందుకు కారణమన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కిమ్ సడన్‌గా ప్రత్యక్షం కావడం, సన్నబడ్డ లుక్‌తో దర్శనమివ్వడంలో అలాంటి రూపురేఖలున్న మరో మనిషికి (డూప్ ) ఆస్కారం లేకపోలేదని సియోల్ పత్రికల కథనం.