హైదరాబాద్ లో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొంత మంది సివిల్ అధికారులు వారి విధులు సక్రమంగా నిర్వహించి పదోన్నతులు పొందాలనే విషయంలో పలు సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం విషయంలో వస్తున్న విమర్శలపైనా ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తంచేశారు.
భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ది పనుల్లో సివిల్ సర్వీసెస్ అధికారులు గణనీయమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ నేతలు ఏ ఇతర శక్తులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా చిత్త శుద్దితో అధికారులు తమ విధి నిర్వహనలు కొనసాగించాలని అన్నారు. రాజకీయ నేతలకు ప్రజలకు మద్య వారధిగా ప్రభుత్వ అధికారులు పని చేయాలని ఆత్మప్రబోధం మేరకు పనిచేయాలని పిలుపునిచ్చారు వెంకయ్య నాయుడు. దేశాభివృద్ది లో కీలక పాత్ర పోషించేది సివిల్ సర్వీసెస్ అధికారులు అన్నారు.
ఇక ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా ఉచిత హామీలు బాగా ఇస్తున్నారని.. ప్రభుత్వాలు అందజేసే ఉచిత పథకాలపై ఆయన పరోక్షంగా మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉంటే తగు రీతిలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది.. కానీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఫ్రీ అనే పదాలు బాగా వినిపిస్తున్నాయని అన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయాలే గానీ ఫ్రీ.. ఫ్రీగా అంటూ కూర్చొబెడితే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఉచితాలను, ఆర్థిక పరిస్థితికి మించిన తాయిలాలు అని పేర్కొన్నారు. ఇది రానున్న రోజుల్లో ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై పెను ప్రభావం అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.