Vegetarian Crocodile Babiya: కేరళ, కాసర్‌ఘడ్ జిల్లాలోని అనంతపద్మనాభ స్వామి వారి గుడి కోనేరులో ఉంటున్న శాఖాహార ముసలి బబియా కన్నుమూసింది. 75 ఏళ్ల వయసులో వృధ్యాప్య సమస్యలతో బబియా మరణించినట్లు తెలుస్తోంది. బబియా అని పిలువబడే సదరు శాఖాహార మొసలి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. బబియా దాదాపు 70 ఏళ్లుగా ఆ గుడిలోని కోనేటిలో ఉంటోంది. ఆ మొసలి ఆ కోనేటి లోకి ఎలా వచ్చింది?.. దానికి బబియా అని ఎవరు పేరు పెట్టారు? అన్న విషయాలు మిస్టరీగానే మిగిలాయి. ఇక, ఈ 70 ఏళ్లలో బబియా ఎవ్వరికీ ఏ హానీ తలపెట్టలేదు.
కోనేటిలో కుప్పలు, కుప్పలుగా చేపలు ఉన్నా.. ఎన్నడూ వాటిని కూడా అది తినలేదు. శాఖాహారిగానే చనిపోయే వరకు ఉండింది. గుడిలోని పూజారికి బబియాకు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ పూజారి బబియాకు రెండు పూటలా భోజనం పెట్టేవాడు. అది కూడా అన్నం ముద్దలను దాన్ని నోట్లో పెట్టేవాడు. ఆ అన్నం ముద్దలను మొసలి ఎంతో ఇష్టంగా తినేది. భక్తులు సైతం ఆ మొసలిని దైవ దూతగా భావించారు. దాన్ని ఎంతో భక్తి భావంతో పూజించేవారు. చాలా మంది ఆ మొసల్ని చూడటానికే ఆ గుడికి వచ్చేవారు. 2020లో ఈ మొసలి గుడిలోంచి బయటకు వచ్చిన దృశ్యాలు..
పూజారి దానికి అన్నం తినిపిస్తున్న దృశాలు వైరల్‌గా మారాయి. అప్పుడు బబియా గురించి ప్రపంచమంతా తెలిసింది. కాగా, సదరు మొసలి గురించి మొసలి నిపుణులు అనిర్బన్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘ ఆ మొసలి ముగ్గర్ జాతికి చెందినది. ఆ జాతి మొసళ్లు సాధారణంగా చేపలను తిని బతుకుతుంటాయి. చేపలతో పాటు పెద్ద పెద్ద జంతువుల్ని కూడా తింటాయి. ఉదాహరణకు.. జింకలు, అడవి పందులు మొదలైన వాటిని తింటుంటాయి’’ అని తెలిపారు.