గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల వరదల బీభత్సం కొనసాగుతుంది. రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా పురోలా ప్రాంతంలో భారీ వర్షాలు కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లపైకి నీరు రావడం.. పలు గ్రామాలు నీట మునగడం జరిగింది. ఇక ఈ వరదల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కొట్టుకుపోయింది. ఆ ఏటీఎంలో రూ.24 లక్షల నగదు ఉందని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ గత కొన్ని రోజులుగా వరుసగా పడుతున్న వర్షాల కారణంగా కుమోలో నది ఉప్పొంగిపోయింది. ఈ క్రమంలో పురోలాలో నది ఒడ్డున ఉన్న ఎనిమిది షాపులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం సైతం కొట్టుకుపోయింది. అంతకు ముందే ఆ ఏటీఎం లో రూ.24 లక్షలు ఉంచినట్లు అధికారులు తెలిపారు. డ్రా చేసిన తర్వాత మిగిలిన డబ్బు అంతా గంగపాలైనట్లే అని భావిస్తున్నారు. అంతేకాదు ఈ వరదలో రెండు నగల దుఖానాలు కూడా కొట్టుకు పోయినట్లు సమాచారం.
ఈ వరదల కారణంగా చుట్టు పక్కల గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇక్కడ నది ఉప్పొంగిపోతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు, రిస్క్యూ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం ముంపు ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇక ఏటీఎం కొట్టుకుపోయే దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.