టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. టెలికామ్ కంపెనీలన్నీ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కు బదులుగా.. 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్ తీసుకురావాలని ఆదేశించింది. ఇందుకోసం ట్రాయ్ టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ లో సవరణలు కూడా చేసింది. ఈ కొత్త రూల్ మొబైల్ ప్రియులకు శుభవార్తగానే చెప్పవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుతం టెలికామ్ కంపెనీలన్నీ నెల అంటే 30 రోజుల వ్యాలిడిటీ కాకుండా కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్స్‌ని ఆఫర్ చేస్తున్నాయని యూజర్లు ట్రాయ్‌ను ఆశ్రయించారు. సాధారణంగా నెల అంటే 30 రోజులు, రెండు నెలలు అంటే 60 రోజులు, మూడు నెలలు అంటే 90 రోజులు ఇవ్వాలి. గతంలో ప్లాన్స్ ఇలానే ఉండేవి. కానీ ప్రస్తుతం టెలికామ్ కంపెనీలు నెలరోజుల ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ, రెండు నెలల ప్లాన్‌కు 56 రోజుల వేలిడిటీ, మూడు నెలల ప్లాన్‌కు 84 రోజుల వేలిడిటీ చొప్పున అందిస్తున్నాయి. దీంతో కస్టమర్లు నెలకు రెండు రోజుల చొప్పున వ్యాలిడిటీ కోల్పోతున్నారు. ఏడాదికి 12 రీఛార్జులు చేయించాల్సింది పోయి 13 రీఛార్జులు చేయాల్సి వస్తోంది. అంటే అదనంగా ఒక రీఛార్జ్ డబ్బుల్ని చెల్లించాల్సి వస్తోంది. అందుకే వినియోగదారులు ట్రాయ్‌ను ఆశ్రయించారు. యూజర్ల నుంచి పిర్యాదులు ఎక్కువగా రావడంతో ట్రాయ్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
ప్రతీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ తప్పనిసరిగా ఒక ప్లాన్ వోచర్, ఒక స్పెషల్ టారిఫ్ వోచర్, ఒక కాంబో వోచర్‌ను 30 రోజుల వేలిడిటీతో అందించాలని టెలీకమ్యూనికేషన్ ఆర్డర్ 1999 లో సవరణలు చేసింది ట్రాయ్. ఈ సవరణ అమలు చేయడంతో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ లభిస్తాయని, టారిఫ్ విషయంలో మరింత ఛాయిస్ ఉంటుందని తెలిపింది.
కానీ చాలాకాలంగా టెలికామ్ కంపెనీలు నెలకు 28 రోజుల చొప్పున లెక్కించి ప్లాన్స్ రూపొందిస్తున్నాయి. ఇవే కాకుండా 21 రోజులు, 24 రోజులు అంటూ భిన్నమైన ప్లాన్స్ తో వస్తున్నాయి. ట్రాయ్ తీసుకొచ్చిన సరికొత్త రూలుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.