ఈ ప్రపంచంలో అన్నిబంధాల్లో స్నేహం బంధం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే అమ్మనాన్న, తొబుట్టువులను ఎంచుకునే అవకాశం మనకు ఉండదు. అయితే స్నేహితుడ్ని మాత్రం ఎంచుకునే అవకాశం మనకు ఉంది. స్నేహానికి పునాది ఇరువురి అభిప్రాయాలు, అభిరుచులు, ఒకటి కావడమూ సహచరులై ఉండటమూ కారణం. వయసూ, ప్రాంతాలు వేరైనప్పటికీ, స్నేహం చేయటానికి, అవి అడ్డంకిగా ఏమీ నిలువవు. ఇక కష్టసుఖాల్లోనూ నేనున్నాను అంటూ ముందుడే వాడే స్నేహితుడు. కొందరి స్నేహాలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగమానదు. స్నేహం కోసం ఎంతటి త్యాగానికైన సిద్ధపడే వారు చాలా మంది ఉన్నారు. స్నేహితుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన, పోరాటలు చేసిన వారు ఎందరో ఉన్నారు. స్నేహబంధాన్ని తెలియజేసే ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా మరోసారి స్నేహం విలువను తెలియజేసే ఘటన ఒకటి చోటుచేసుకుంది.
అంగవైకల్యం కలిగిన స్నేహితులు ఉంటే ఎవరైనా అప్పుడప్పుడు కాలకృత్యాల్లో సాయం చేస్తుంటారు. అంతేకాక అప్పుడప్పుడు వారికి దగ్గర ఉండి చదువు కూడా నేర్పిస్తుంటారు. కానీ స్నేహం కోసం ఓ చిన్నారి చేస్తున్న పని చూసి అందరికి ఆశ్చర్యం వేసింది. పోలియోతో నడవలేని స్థితిలో ఉన్న తన స్నేహితురాలని..తన భుజంపై వేసుకుని స్కూల్ కి తీసుకెళ్తుంది. ఏదో పక్కనే ఉన్న స్కూలే కదా అని మీరు అనుకుంటే పొరపాటే. వారి ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఉన్న బడికి తీసుకెళ్తుంది. తన స్నేహితురాలి భుజంపై బడిబాట పట్టింది ఆ చిన్నారి. మనస్సుకు హత్తుకునే ఈ ఘటన ఒడిశా లో చోటుచేసుకుంది.
ఒడిశా రాష్ట్రం సుందర్ గఢ్ జిల్లా కోయిడ సమితి కుసుముండి గ్రామానికి చెందిన ముంగిరి బడా(9) అనే చిన్నారి ఉంది. ఆమెకు జయసికా బడా(8) అనే స్నేహితురాలు ఉంది. ముంగిరా అదే ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. తన స్నేహితురాలు జయసిక కు పోలియో సోకడంతో ఇంట్లోనే ఉండేది. వీరిద్దరు నిత్యం ఇంటి వద్ద ఆడుకునేవారు. తనకు కూడా పాఠశాలకు రావాలని ఉందని జయసికా, ముంగిరితో తన మనస్సులోని మాటను చెప్పింది. దీంతో స్నేహితురాలి ఆవేదనను అర్థం చేసుకున్న ముంగిరా.. తన స్నేహితురాలిని ఎలాగైన బడికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. తాను చదివే పాఠశాలలోనే ఒకటవ తరగితో జాయిన్ చేసింది.
అలా స్కూలో చేర్పించడంతోనే ముంగిరా ఆగలేదు. తన స్నేహితురాలిని భుజంపై అరకిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకో రోజు తీసుకెళ్తుంది. ఇలా రోజూ స్నేహితురాలి భుజంపై బడికి వెళ్తుంది ఆ చిన్నారి. స్నేహితురాలిపై ముంగిరి చూపిన ప్రేమకు ఆ స్కూల్ ఉపాధ్యాయులు సైతం చాలా సంతోష పడ్డారు. అంతేకాక జయసిక విషయంలో ముంగిరా చూపిన చొరవకు స్థానికులు ముచ్చటపడి, ఆమెను అభినందిస్తున్నారు. స్నేహం కోసం పట్టుమని పదేళ్లులేని ఈ చిన్నారి చేస్తున్న ఈ పని చూసి నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తూ.. ఆ చిన్నారి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.