నేటికాలంలో నిజాయితీ అనేది చాలా మందిలో కొరవడింది. అందుకే పరుల సొమ్ము కోసం ఆరాట పడుతుంటారు. ఇంకా ఎక్కడైనా సొమ్ము దొరికితే మూడో కంటికి తెలియకుండా తీసుకెళ్లేవాళ్లే ఎక్కువ ఉన్నారు. అయితే కొద్దిమంది మాత్రమే తమకు దొరికిన సొమ్మును నిజాయితీగా పోలీలుకు ఇస్తుంటారు. కోట్లు రూపాయాలు దొరికిన పరుల సొమ్ము పాము వంటిది అని భావించేవారు కొందరు ఉంటారు. అయితే నిజాయితీకి ఆడ, మగ, చిన్న, పెద్ద అనే వాటితో సంబంధం ఉండదు. కొందరు పెద్దవారు.. నలుగురికి మంచి చెప్పేది పోయి..వారే పరుల సొమ్ము కాజేస్తుంటారు. వయస్సులో చిన్నవారైన కొందరు పిల్లలు తమ నిజాయితీని చాటుకుని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంటారు. అందుకు ఉదాహరణ తమిళనాడుకు చెందిన 5 తరగతి విద్యార్ధినులు. తమకు దొరికిన సొమ్ములు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ చిన్నారులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రం కొరుక్కుపేట కార్నేశన్ నగర్ చెందిన రాధిక, నిషా, ఏంజల్, కావ్య అనే నలుగురు చిన్నారులు ‘చెన్నై మాధ్యమిక పాఠశాల’లో ఐదో తరగతి చదువుతున్నారు. వారు చదువులో ఎంతో బాగా రాణిస్తూ.. ఉపాధ్యాయుల వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రతి రోజూ ఇంటి నుంచి నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్లి వస్తుండేవారు. అలానే నవంబరు 28న కూడా ఆ నలుగురు పాఠశాల ముగిసిన తరువాత ఇంటికి నడచి వెళ్తున్నారు. ఈక్రమంలో వారు రామస్వామి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో రాగానే రోడ్డు పక్కన ఓ పర్సు పడి ఉండటాన్ని గుర్తించారు. ఆ పర్సును తెరచి చూడగా అందులో రూ.7,700 ఉన్నాయి. దీంతో ఆ చిన్నారు ఒక్కసారిగా షాకయ్యారు. ఎవరో పాపం పొరపాటున పోగొట్టుకున్నారని భావించిన ఆ చిన్నారులు వారికి ఎలాగైనా అందేలా చేయాలని భావించారు.
దీంతో వెంటనే వారు నలుగురు కలిసి ఆ పర్సుతో ఆర్‌కే నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. తమకు దొరికిన పర్సును అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆ పిల్లల్ని అభినందించిన పోలీసులు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి పంపించారు. ఈ నేపథ్యంలో, ఈ విషయం తెలుసుకున్న సిటీ పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ బుధవారం విద్యార్థులను తన కార్యాలయానికి పిలిచి అభినందనలు తెలియజేశారు. చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు రూ.1,000 నగదు ఇచ్చి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. చివరకి వారిని భద్రంగా తిరిగి ఇంటికి పంపారు. అయితే ఆ నలుగురు చిన్నారులు చేసిన ఈ మంచి పనికి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి.