సాధారణంగా దొంగలు ఇళ్లల్లో చొరబడి బంగారం, డబ్బు ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లడం చూస్తూనే ఉంటాం. కొంత మంది ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచ్ కి తెగబడుతున్నారు. బిహార్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. సమస్తీపూర్ జిల్లాలో ఓ చెక్కెర కర్మాగారం కోసం ఏర్పాటు చేసిన రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ ని మాయం చేశారు దొంగలు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేపట్టగా ఓ ఇంటిలో ఆ పట్టాలకు సంబంధించిన ముక్కలు లభ్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో దొంగలకు సహకరించిన ఇద్దరు రైల్వే సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. కాగా అసలు దోషుల కోసం వెతుకుతున్నారు.
గతంలో బీహార్ లో పలు విచిత్రమైన దొంగతనాలు అయ్యాయి. రిపేర్ కోసం తెచ్చిన ఓ రైల్ ఇంజన్ ని దొంగల సొరంగం తవ్వి మరీ ఎత్తుకు వెళ్లి దాన్ని పార్టులు పార్టులుగా విడదీసి అమ్ముకున్నారు. మరోచోట ఏకంగా రెండు సెల్ ఫోన్ టవర్లనే ఎత్తుకువెళ్లారు. వాడుకలో లేని ఓ బ్రిడ్జీని గుట్టు చప్పడు కాకుండా మాయం చేశారు. ఈ క్రమంలో కొంత మంది దొంగలకు సమస్తీపూర్ జిల్లాలో లోహత్ చెక్కర ఫ్యాక్టరీ కోసం ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్ పై కన్ను పడింది. అంతే పక్కా ప్లాన్ తో ఆ రైల్వే ట్రాక్ ని దొంగిలించారు. పక్కా సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు ఫ్యాక్టరీ పక్కనే ఉన్న బెలాహి అనే గ్రామంలోని ఓ వ్యక్తి ఇంట్లో రైల్వే ట్రాక్ లను సంబంధించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.
లోహత్ షుగర్ ఫ్యాక్టరీ కొంత కాలంగా మూతపడిపోయింది. దీంతో ఆ ట్రాక్ కూడా వాడుకలో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో లోహత్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన వస్తువులను స్క్రాప్ కింద బియాడా అనే కంపెనీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఫ్యాక్టరీలోని వస్తువులను తరలిస్తుంది. ఆ సమయంలోనే రైల్వే ట్రాక్ దొంగిలించబడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆర్పీఎఫ్‌లో పోలీసు కేసు నమోదైంది. అయితే ప్రాథమిక విచారణలో ఇద్దరు అధికారులపై వేటు పడింది. కొందరు స్క్రాప్ వ్యాపారులతో వీరిద్దరూ కుమ్మక్కై అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఒకవేళ వీరిద్దరూ దోషులుగా తేలితే వారిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే పూర్తి ట్రాక్ ని ఎక్కడికి తరలించారనే విషయం పై ఆరా తీస్తున్నారు ఆర్పీఎఫ్ పోలీసులు.