గత కొంత కాలంగా సినిమా హాళ్లలో ప్రేక్షకులకు మంచి నీటి సదుపాయం అనే అంశంపై వివాదాలు కొనసాగుతున్నాయి. థియేటర్, మల్టీప్లెక్సుల్లో తాము అమ్మేవాటినే తప్ప బయటి నుంచి కనీసం వాటర్ బాటిళ్లు కూడా అనుమతించబోమంటూ సొంత రూల్స్ అమల్లోకి తెచ్చారు. చాలా చోట్ల రూ.20 వాటర్ బాటిల్ ను రూ.50 వరకు అమ్మేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లలోకి బయటి నుంచి తాగునీటి బాటిల్స్ తెచ్చుకోవడాన్ని అనుమతించకపోతే.. థియేటర్ల నిర్వాహకులే ప్రేక్షకులకు ఉచిత తాగునీరు అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
కొంత కాలాంగా భద్రతా చర్యలు పాటిస్తూ.. హాళ్లు.. థియేటర్ల లోపలికి బయట నుంచి ఏమీ అనుమతి ఇవ్వడం లేదన్న విషయం తెలిసిందే. అయితే బయటి నుంచి వాటర్ బాటిళ్లు తీసుకురాకుండా నిషేధించే హక్కు థియేటర్ యాజమాన్యానికి ఉంటుందని తేల్చి చెప్పిన హైకోర్టు.. అలా నిషేధిస్తే మాత్రం యాజమాన్యమే ఉచితంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ప్రేక్షకులు థియేటర్లోకి వాటర్ బాటిల్ పేరుతో తెచ్చే బాటిళ్లలో ఆల్కహాల్ లేదా.. ఇతర ప్రమాదకర రసాయనాలు.. బాటిల్ బాంబులు వంటివి తీసుకువచ్చే అవకాశం ఉందన్న థియేటర్ల యాజమాన్యాల ఆందోళన సరైనదేనని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది.
ఒకవేళ థియేటర్ల యాజమాన్యం భద్రత కోసం తాగునీటి బాటిళ్లను నిషేథించాలనుకుంటే సినిమా హాళ్లలో వాటర్ కూలర్లను ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ఉచిత తాగునీటి సౌకర్యం కల్పించాలని జస్టిస్ ఎస్‌ఎం సుబ్రమణ్యం స్పష్టం చేశారు. అంతే కాదు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన తాగునీటిని సినిమా హాల్స్ లోపల అందుబాటులో ఉంచాలని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. సినిమా థియేటర్లలో ఉచిత మంచినీటి సౌకర్యంపై దేవరాజన్ అనే తమిళుడు 2016 నుంచి న్యాయపోరాటం చేస్తున్నాడు. ఐదేళ్ల కిందట ఆయన వేసిన పిటిషన్ పై ఇపుడు తీర్పు వచ్చింది. కాగా, ప్రస్తుతానికి ఈ ఉత్తర్వులు తమిళనాడు వరకే పరిమితం కానున్నాయి.