ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రకటించే రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మారుస్తూ మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ అవార్డు పేరులో మార్పులు చేస్తూ హాకీ లెజండ్‌గా పేరు ప్రఖ్యాతలు పొందిన ధ్యాన్‌చంద్ పేరు మీదుగా ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా పేరు మార్చారు. ఇక ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. చాలా కాలం నుంచి పేరు మార్చాలని ప్రజల నుంచి వినతులు వచ్చాయి. దీని కారణంగానే ఈ అవార్డు పేరులో మార్పులు చేశామని తెలిపారు.
ఖేల్ రత్న అవార్డు భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారం. భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జ్ఞాపకార్ధం 1991-92 లో ఈ పురస్కారాన్ని ప్రారంభించారు. ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్‌వెల్త్ క్రీడల్లో గాని, బిలియర్డ్స్, స్నూకర్, క్రికెట్, చదరంగం వంటి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దేశ వ్యాప్తంగా ఎలాంటి వినతులు రాలేదని, కావాలనే మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది.