దేశంలో కరోనా కేసులు మొదలైన తర్వాత విద్యావ్యవస్థపై ఎంతగా పడిందో అందరికీ తెలిసిందే. కరోనా ప్రభావంతో విద్యార్థులు ఆన్ లైన్ చదువులకే అంకితమయ్యారు. ఈ మద్య కొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు అనుమతులు ఇచ్చినా.. తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను పంపించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇక కేరళాలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి.
గురువారం కొత్తగా 32,097 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 188 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో క్రియాశీల కేసుల సంఖ్య లక్ష దాటినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మరోవైపు దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఎంటర్ అవుతోందా లేదా పెరుగుతున్న కేసులు కోవిడ్ థర్డ్‌వేవ్‌కు సంకేతాలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్న అన్‌లాక్, ఆంక్షల సడలింపు కారణంగా కరోనా సంక్రమణ మరోసారి విస్తరిస్తోంది. అయితే కరోనా ఎఫెక్ట్ కేరళాలో దారుణంగా ఉండటంతో అక్కడ వచ్చేవారం నుంచి జరగబోయే 11వ తరగతి పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులను ప్రమాదంలో పెట్టడం సరికాదని అభిప్రాయపడింది. కేరళలో సెప్టెంబరు 6 నుంచి 11వ తరగతి పరీక్షలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం.. కేరళ ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర స్టే విధించింది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 70 శాతం కేరళలోనే నమోదవుతున్నాయని సుప్రీం ధర్మాసనం తెలిపింది. రోజుకు దాదాపు 35 వేల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ప్రమాదంలోకి నెట్టలేమని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది.