సాధారణంగా ఇంటి బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ పుట్టింటికి వెళ్తున్న భార్యలు.. భర్తలు చెప్తుంటారు. అయితే ఇక్కడ ఓ భార్య మాత్రం ఏకంగా జిల్లా బాధ్యతలనే భర్తకు అప్పగించింది. “ఇంతకాలం జిల్లా వ్యవహారాల్ని నేను చూశాను. ఇక మీ వంతు వచ్చింది. మీరే జాగ్రత్తగా చూసుకోండి” అంటూ జిల్లాను తన భర్తకు అప్పగించారు. అయితే జిల్లాను భర్తకు అప్పగించడం ఏంటి? అది ఏమైన వారి ఆస్తినా? అనే సందేహాలు చాలా మందికి రావచ్చు. అయితే ఈ అరుదైన ఘటనకు వేదికైంది కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్. ఇంతకు అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
కేరళకు చెందిన రేణు రాజ్, శ్రీరామ్ వెంట్రామన్ భార్యభర్తలు. రేణు రాజ్ అలప్పుళ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమెను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో శ్రీరామ్ వెంట్రామన్ ను అలప్పుళ జిల్లా కలెక్టర్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో మంగళవారం జిల్లా కలెక్టర్ బాధ్యతలు శ్రీరామ్ చేపట్టారు. ఆయనకు జిల్లా బాధ్యతలు అప్పగించారు రేణు రాజ్. ఈ సందర్భంగా.. “ఇంతకాలం జిల్లా వ్యవహారాల్ని నేను చూశాను. ఇక మీ వంతు వచ్చింది. మీరే జాగ్రత్తగా చూసుకోండి” అంటూ తన బాధ్యతలను భర్త శ్రీరామ్ కి అప్పగించారు రేణు రాజ్.
ఇక ట్వీస్ట్ ఏంటంటే.. వీళ్లిద్దరు మొదట్లో వైద్యులు.. ఆ తర్వాత సివిల్స్ కి ప్రిపేర్ అయి.. అందులో విజయం సాధించి.. ఐఏఎస్ అధికారులుగా మారారు. రేణు రాజ్, శ్రీరామ్ లు ఈ ఏడాది ఏప్రిల్ లోనే పెళ్లి చేసుకున్నారు. శ్రీరామ్ అలప్పుళ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టక ముందు కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులతో శ్రీరామ్.. అలప్పుల జిల్లా కలెక్టర్ గా బాధ్యతల స్వీకరించారు. మరి.. ఈ అరుదైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.