సత్య మలేషియాలో ఉద్యోగం చేసేవాడు. అతడికి నెలకు 2 లక్షల రూపాయల జీతం వచ్చేది. అయినా అందులో అతడికి సంతోషం ఉండేది కాదు. అందుకే ఉద్యోగాన్ని వదిలేశాడు. ఇండియాకు వచ్చి వ్యవసాయం మొదలుపెట్టాడు.
‘ఉన్నది ఒకటే జీవితం.. ఎంత కాలం బతుకుతామో తెలీదు. బతికినంత కాలం ఎందుకు టెన్షన్ పడుతూ బతకాలి’ ఇది ప్రతీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బుర్రలో మెదిలే ఆలోచన. అయితే, అనుకున్నంత ఈజీగా జాబులు వదిలేయటం అందరి వల్ల కాదు. కానీ, కొందరు మాత్రమే తాము అనుకున్నది చేయగలుగుతూ ఉంటారు. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అలాంటి వారి జీవితాలే సక్సెస్ స్టోరీలుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సత్య ప్రవీణ్ జీవితం కూడా అలాంటిదే. అతడు విదేశాల్లో లక్షల జీతాన్ని వదిలి.. స్వదేశంలో రైతుగా మారాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒడిశాలోని రాయగడ జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సత్య ప్రవీణ్ మలేషియాలో ఐటీ ఉద్యోగం చేస్తూ నెలకు రూ.2 లక్షల జీతం గడించేవాడు. చిన్నప్పటినుంచి అతడికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం మీద మక్కువ తోటే అతడు తన ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. స్వగ్రామంలో వ్యవసాయం ప్రారంభించాడు. సత్య తండ్రి కూరగాయలు పండించేవాడు. ఇక సత్య తమ 34 ఎకరాల భూమిలో డ్రిప్ సిస్టమ్, సేంద్రియ ఎరువులతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో వ్యవసాయంలో విజయం సాధించాడు. సత్య ఆధునిక పద్ధతులు,సేంద్రీయ ఎరువులను ఉపయోగించి రక,రకాల కూరగాయలను పండించాడు.
తాను వ్యవసాయం చేయటానికి పొరుగు గ్రామాల నుంచి 60 మందిని పనుల నిమిత్తం నియమించుకున్నాడు. సత్య వ్యవసాయం చేస్తున్న విధానం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. కలెక్టర్ స్వధా దేవ్ సింగ్ సత్య వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి, అభినందించారు. అంతేకాదు! సత్య సాధిస్తున్న విజయాన్ని అందరూ కొనియాడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి సంకల్పం, పట్టుదలతో వ్యవసాయంలో సత్య సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మరి, సత్య సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.