దేశం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది సాధిస్తున్నప్పటికీ.. కొన్ని చోట్ల దళితులపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దళితులను ఆలయాల్లో ప్రవేశించకుండా నిషేధించడం, దళితులపై హింసకు సంబంధించి అనేక సంఘటనలు మీడియాలో తరచూ వినిపిస్తూనే ఉన్నాయి.
ఓ వైపు దేశం అభివృద్ది పథం వైపు దూసుకు వెళ్తున్నా.. కొన్ని చోట్ల దళితుల పట్ల ఇప్పటికీ అఘాయిత్యాలు, దురాఘతాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులోని మధురైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మిఠాయి దొంగిలించారన్న నెపంతో ఇద్దరు దళిత విద్యార్థులను దారుణంగా కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.
మధురై జిల్లా కరైకేణికి చెందిన ఇద్దరు దళిత విద్యార్థులు అచ్చంపట్టి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఈ ఇద్దరు విద్యార్థులు పాఠశాల సమీపంలో ఉన్న ఆది ద్రావిడర్ సంక్షేమ హాస్టల్ లో ఉంటున్నారు. మార్చి 21 న అలంపట్టి కి వెళ్లి ఓ షాప్ లో వెళ్లి మిఠాయిలు కొనుకున్నారు. ఆ సమయంలో షాపు చాలా రద్దీగా ఉంది. హఠాత్తుగా షాపు యజమాని తన షాపు లో నుంచి ఇద్దరు విద్యార్థులు మిఠాయిలు దొంగిలించారని ఆరోపించారు. అంతేకాదు షాపు యజమాని సంతోష్ తో పాటు.. అతని బంధువులు విద్యార్థులను దగ్గరలోని స్తంబానికి కట్టేసి చితకబాదారు. తాము దొంగిలించలేదని.. మిఠాయిలు కొన్నామని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు.
సమాచారం తెలుసుకున్న హాస్టల్ కీపర్ విజయన్.. దాడికి గురైన విద్యార్థుల్లో ఒకరికి బంధువు. షాపు యజమానితో మాట్లాడి విద్యార్థులను విడిపించారు. స్థానికంగా ఈ సంఘటన కలకలం రేపడంతో విషయం తెలుసుకున్న జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శివ ప్రసాద్, విద్యార్థులను కొట్టిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో పోలీసులు షాపు యజమాని సంతోష్, అతనికి సహకరించిన బంధువులపై ఐపీసీ, జువైనల్ జస్టిస్ చట్టం లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. నిందితులపై చర్యలు తీసుకోవాలని అబాలిషన్ ఆఫ్ అస్పృశ్యతా ఫ్రంట్ (ఏయూఎఫ్) డిమాండ్ చేసింది. బాధిత విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి చదువు కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని.. వారి కుటుంబానికి తగిన రక్షణ అందించాలని డిమాండ్ చేసింది.