బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్ రెంటల్ ఛార్జీ పెరిగింది. ఇన్నాళ్లూ బ్యాంక్ లాకర్ల విషయంలో బ్యాంకులు తమ ఇష్టానికి పనిచేసేవి. తమ సొంత నియమావళితో బ్యాంకులు ముందుకు వెళ్ళేవి. అయితే, లాకర్ల విధానాన్ని పారదర్శకం చేయాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ దేశంలోని అన్ని బ్యాంకులకు ఈ విధానాన్ని అమలు చేయాలంటూ సూచించింది. ఈ రూల్స్ 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకు లాకర్ సర్వీసుల నిబంధనలను ఆర్బీఐ సవరించింది. అగ్నిప్రమాదం, కూలడం, సిబ్బంది మోసం, చోరీ వంటి కారణాలతో లాకర్లలో దాచిన వాటికి నష్టం వాటిల్లిన సందర్భాల్లో వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ సూచించింది.
చట్ట విరుద్ధమైనవి బ్యాంకు లాకర్లలో ఉంచడానికి వీల్లేదని తెలిపింది. ప్రకృతి విపత్తుల నష్టానికి మాత్రం బ్యాంకులు బాధ్యత ఉండదని తెలిపింది. ప్రస్తుత లాకర్ నిర్వహణ నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని పేర్కొంది. ఆరు నెలల్లోగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లాకర్ సౌకర్యాల నిర్వహణపై కొత్త మార్గదర్శకాలను నిర్వహించి, దేశవ్యాప్తంగా బ్యాంకులు అమలు చేసేలా చూడాలని సూచించింది.
బ్యాంకుల బాధ్యతను ఆర్బీఐ పరిమితం చేసింది. ఈ కొత్త బ్యాంకు లాకర్ రూల్స్‌ను బ్యాంకులు సవరించుకోవాల్సి ఉంటుంది. బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్/సేఫ్ కస్టడీ ఆర్టికల్ సర్వీసులను ఆర్బీఐ సమీక్షించింది. వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని లాకర్ నిబంధనల్లో సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.
ప్రస్తుత, నూతన కస్టమర్లకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయని తెలిపింది. బ్యాంకు లాకర్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో లిస్టుతో పాటు ప్రతి అప్లికేషన్ వెయిట్ లిస్టు జాబితాను నిర్వహించాల్సి ఉంటుందని సూచించింది.