ప్రతివారి జీవితంలో వివాహం ఒక గొప్ప వేడుక అని అంటారు. ఈ మద్య వివాహాలు రక రకాల పద్దతుల్లో జరుపుకుంటున్నారు. కొంత మంది సముద్రం లోపల చేసుకుంటే.. కొంత మంది ఆకాశ మార్గాన వివాహాలు జరుపుకుంటున్నారు. వివాహం అనేది తమ తమ ఆర్థిక స్థోమతను బట్టి జరుపుకుంటారు. తాజాగా పంజాబ్ లోకి ఓ గ్రామంలో ప్రజలు తమ పెద్ద మనసు చాటుకున్నారు. గ్రామస్థులంతా పెద్ద మనసు చేసుకొని ఓ పేద యువతికి ఘనంగా పెళ్లి జరిపించారు.. అయితే ఆ వివాహం స్మశానంలో చేశారు. అమృత్సర్ జిల్లాలోని మోహకాంపుర గ్రామంలో ఈ వివాహం జరిగింది. వివరాల్లోకి వెళితే..
మోహకాంపూర ఊరిలో ఒక శ్మశానవాటిక ఉంది. అక్కడ ఓ చిన్న గదిలో ఓ వృద్దురాలు తన మనవరాలితో కొంత కాలంగా జీవిస్తుంది. ఇద్దరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గ్రామ ప్రజలతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. స్మశాన వాటికకు వచ్చిన వారికి సహాయ సహకారాలు అందించేవారు. అలా వారి నిజాయితీ చూసి గ్రామ ప్రజలు తమకు తోచిన సహాయం చేస్తూ ఉండేవారు. అయితే వృద్దురాలి మనవరాలికి పెళ్లి వయసు రావడంతో గ్రామ ప్రజలు వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం గ్రామ ప్రజలు పెద్ద మనసు చేసుకొని కొంత డబ్బును పోగు చేసి యువతి వివాహం ఘనంగా జరిపించారు. అక్కడే విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు బారాత్ కూడా ఏర్పాటు చేసి వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. విశేషం ఏంటంటే ఆ యువతి వివాహం శవాలను దహనం చేసే శ్మశానవాటికలో పెళ్లి జరిపించారు.
ఈ విషయం గురించి గ్రామ పెద్దలు మాట్లాడుతూ..‘చాలా కాలంగా శ్మశానవాటికలో ఒక చిన్న గదిలో వృద్దురాలు తన మనవరాలితో ఉంటుంది.. వారు ఎంతో ప్రేమ, నిజాయితీ, ఆప్యాయలతో ఉండేవారు. శ్మశానవాటికకు వెళ్లిన వారి సహాయం చేస్తుండేవారు. ఆ వృద్దురాలు ఎంతో పేదరికంలో ఉంది.. అందుకే గ్రామ ప్రజలంతా కలిసి ఆడబిడ్డకు వివాహం జరిపించాం.. ఇది మాకెంతో గర్వంగా ఉంది’, అంతేకాదు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇలాగే వివాహం చేసుకుంటారు.. అలా చేస్తే ఎలాంటి అరిష్టాలు ఉండవని నమ్మకం’అన్నారు. గ్రామ పెద్దల సహకారం తో తన మనవరాలి పెళ్లి చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని వధువు అమ్మమ్మ ప్రకాశ్ కౌర్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది.