టెక్ ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి. ఆర్థిక సంక్షోభం వస్తే లక్షల్లో ప్యాకేజ్ తీసుకున్న వారు కూడా రోడ్డున పడాల్సిందే. మనిషి ఆశాజీవి. జీతం బట్టి ఆశలు, ఖర్చులు పెంచుకుంటారు. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో జాబ్ అంటే లగ్జరీ లైఫ్, కార్లు, ఖరీదైన ఇల్లు, వీకెండ్ పార్టీలు, సరదాలు, షికార్లు, జాలీ లైఫ్ ఇవి మాత్రమే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని భారీ రుణాలు, వాటి ఈఎంఐలు, కార్పొరేట్ కల్చర్ కి తగ్గట్టు బ్రాండ్ మెయింటెనెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చిరు ఉద్యోగులే తమకు వచ్చే జీతాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఇంటికో, వాహనానికో మరేదో దానికో ఒక ప్రణాళిక వేసుకుని లోన్ తీసుకుని.. వచ్చిన జీతంలో కొంత వాయిదా కడుతుంటారు. ఇక లక్షల్లో జీతం వస్తుందంటే.. ఆ కల కూడా పెద్దగానే ఉంటుంది కదా.
ఆ కలకి తగ్గట్టు సొంత ఇల్లు కట్టుకోవడమో, ఒక ఫ్లాట్ కొనుక్కోవడమో, ల్యాండ్ కొనుక్కోవడమో, కారు కొనుక్కోవడమో ఇలా కొన్ని అవసరాలకు లోన్ పెట్టుకుని.. నెల నెల వాయిదాలు కడుతుంటారు. ఇది ఒక చక్రం. రొటేషన్ అవుతూ ఉండాలి. మధ్యలో ఆగిపోతే జీవితాలు ఒక్కసారిగా స్థంభించిపోతాయి. ప్రస్తుతం టెకీల పరిస్థితి ఇలానే ఉంది. ఆర్థిక మాంద్యం కారణంగా.. దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ 18 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇక గూగుల్ 12 వేల ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.
మెటా సంస్థ 11 వేలకు పైగా ఉద్యోగులను, మైక్రోసాఫ్ట్ 10 వేలకు పైగా ఉద్యోగులను, సేల్స్ ఫోర్స్ సంస్థ 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఉద్యోగులకు సారీ చెప్పి ఇంటికి పంపించేస్తున్నాయి. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ కూడా.. రోజుకు జీతాలకు 4 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని.. ఉద్యోగులను తొలగించడం తప్ప వేరే దారి లేదని చేతులెత్తేశారు. 3700 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. ఇవి మాత్రమే కాకుండా.. నెట్ ఫ్లిక్స్, లిఫ్ట్, స్ట్రైప్, షాపిఫై వంటి కంపెనీలు కూడా భారీగా ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను తీసేయడం తప్ప వేరే దారి లేదని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
దాదాపు 70 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బండ్లు ఓడలవుతాయ్, ఓడలు బండ్లవుతాయ్. అన్నిటికీ ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు పోయే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. కొంతమంది ఎటువంటి కష్టాలనైనా తట్టుకుంటారు. కొంతమంది తట్టుకోలేరు. కాబట్టి అలాంటి వాళ్ళు ముందు నుంచి సేవింగ్స్ పై దృష్టి పెట్టాలని అంటున్నారు. డబ్బులు వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి.. డబ్బు లేనప్పుడు బాధపడేకంటే.. ముందు నుంచి ఇలాంటి పరిస్థితులు వస్తాయని అంచనా వేసి.. దానికి తగ్గట్టు డబ్బులు పొదుపు చేసుకోవాలని సూచిస్తున్నారు.
కొంతమంది తమ జీతం డబ్బులను విలాసాలకు, తాత్కాలిక ఆనందాలకు ఖర్చు పెట్టకుండా.. దాన్ని పొలం, స్థలాలు, ఇల్లు, బంగారం వంటి శాశ్వత ఆస్తుల మీద పెట్టుబడి పెడుతుంటారు. అందుకే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అంటారు, ఖర్చు తిరిగి రానిది, పెట్టుబడి ఎక్కడకీ, ఎప్పటికీ పోనిది అని. అందుకే స్మార్ట్ గా ఆలోచించాలని అంటారు. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు బాధపడాల్సిన పని లేదని అంటున్నారు. పడిపోవడం, లేవడం అనేది ఏ రంగంలో అయినా మామూలే. జీవితంలో ఏం జరిగినా అంతా మంచికే అనుకుంటే సమస్యే ఉండదు. ఇంకా ఖాళీగా ఉన్నప్పుడే గొప్ప గొప్ప ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆలోచిస్తే మీరే ఒక కంపెనీ పెట్టే స్థాయి వస్తుందేమో. ఉద్యోగంలో ఉన్నంతసేపూ ఒత్తిడి కారణంగా.. ఆలోచించే తీరిక ఉండకపోవచ్చు. ఇప్పుడు రోజుకి 24 గంటల సమయం ఉంది.
కాబట్టి సృజనాత్మకత కలిగిన అద్భుతమైన ఆలోచనలు, మనుషులు ఎదుర్కుంటున్న సమస్యలకి పరిష్కారం ఒక కోడింగ్ ద్వారా చూపించవచ్చు. గొప్ప గొప్ప విజయాలన్నీ అపజయాల నుంచే మొదలయ్యాయి. అభిమానాలన్నీ అవమానాలను దాటుకునే వస్తాయి. కాబట్టి నిరాశ పడవద్దని సూచిస్తున్నారు. శారీకరంగా, మానసికంగా దృఢంగా ఉంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించవచ్చునని అంటున్నారు. పరిస్థితులు పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. మనుషులు ఆకాశం లాంటోళ్ళు. ఉరుమొచ్చినా, మెరుపొచ్చినా, పిడుగొచ్చినా పైనే ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు డబ్బే పెట్టుబడి, ఏమీ లేనప్పుడు ధైర్యమే పెట్టుబడి. ప్రతికూల పరిస్థితులు సరికొత్త జీవితానికి పునాదులు, సమాధులు కాదని గుర్తిస్తే చాలు. జీవితాన్ని ఉన్నంతలో గొప్పగా ఆస్వాదించవచ్చునని పెద్దలు చెప్పే మాట. ఇలాంటి పరిస్థితుల్లో టెకీలకి అంతా ధైర్యం చెప్పాలి.