మణిపూర్‌లో చోటుచేసుకున్న మారణ హోం కారణంగా ఇప్పటి వరకు 54 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు. కోట్ల ఆస్తి నష్టం సైతం జరిగింది..
మణిపూర్ రాష్ట్రంలో చోటుచేసుకున్న మారణ హోమం నేడు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్ అల్లర్ల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఈ అల్లర్లలో 54 మంది తమ ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. మణిపూర్‌లో ఇంతలా విధ్వంసం జరగటానికి కారణం ఏంటి? ఇంతకీ మణిపూర్‌లో ఏం జరుగుతోంది?
మణిపూర్ రాష్ట్రంలో ప్రధానంగా మూడు జాతులు ఉన్నాయి. అవి మైతీ, నాగా, కుకి జాతులు. మైతీలలో ఎక్కువ శాతం హిందువులు, కొంతమంది ముస్లింలు ఉన్నారు. తర్వాతి జాతులైన నాగా, కుకీలలో క్రిస్టియన్లు అధికం. నాగా, కుకీలను ప్రభుత్వం షెడ్యూల్డ్ ట్రైబ్స్‌గా గుర్తించింది. ఇక, మైతీలు రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్నారు. జనాభా పరంగానే కాదు రాజకీయ పరంగా కూడా మైతీలది రాష్ట్రంలో పైచేయి. మణిపుర్‌లో 60 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 40 మంది మైతీ తెగకు చెందిన వారు ఉండటం గమనార్హం. అంతేకాదు! ఇప్పటివరకు 10 మంది మైతీకి చెందిన వారు ముఖ్యమంత్రులుగా పని చేశారు. కేవలం రెండు సార్లు మాత్రమే నాగా, కుకీ జాతికి చెందిన వారు పని చేశారు.
రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న మైతీలు చాలా ఏళ్లనుంచి తమకు ఎస్టీ హోదా కావాలని పోరాటం చేస్తున్నారు. ఈ మేరకు మైతీలు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. 1949కి ముందు తమకు ఎస్టీ హోదా ఉండేదని అంటున్నారు. 2012లో ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసుకున్నారు. తమను ఇతర తెగలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు మైతీల పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. దానికి సంబంధించి ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మైతీల ఎస్టీ హోదా డిమాండ్ పదేళ్లుగా పెండింగ్‌లో ఉందని.. నాలుగు వారాల్లో జవాబు ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీనిపై కేంద్రం అభిప్రాయాన్ని సైతం కోరింది. అయితే, కోర్టు ఆదేశాలను అప్పటికే ఎస్టీలుగా ఉంటున్న వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో గొడవ మొదలైంది. మైతీలను ఎస్టీల్లో చేర్చొద్దంటూ వారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆల్ ట్రైబల్స్ సూడెంట్స్ దీనిపై నిరసనకు దిగారు. మణిపూర్‌లో ఒక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అనుకోని ఘటన జరిగింది. గిరిజన తెగల వారికి, మిగిలిన తెగ వారికి గొడవ జరిగింది. ఆ గొడవ చినికి, చినికి గాలి వాన అయింది. ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. పదుల సంఖ్యలో మంది ప్రాణాలను బలితీసుకుంది. మరి, ఈ మారణ హోమంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.