ప్రపంచ ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. తాజ్ మహల్.. దీన్ని కట్టి ఎన్నో వందల సంవత్సరాలు అవుతున్నా.. ఇంకా ఈ కట్టడాన్నే ప్రేమకు చిహ్నంగా గుర్తిస్తారు ప్రేమికులు. షాజహాన్.. తన భార్య ముంతాజ్ కోసం నిర్మించిన ఈ కట్టడం చుట్టూ ఎన్నో కథలు ఉన్నాయి. అందులో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీదు కానీ తాజ్ మహల్ మాత్రం ఎప్పటికీ చాలామంది మనసులో నిలిచిపోయే ఓ జ్ఞాపకం.
సాధారణంగా తమ ప్రేమను వ్యక్తపర్చడానికి పువ్వులు లేదా చాక్లెట్లు వంటి బహుమతులకు ఇస్తూ ఉంటారు. కాస్త ఉన్నతవర్గాల్లో తమ స్థాయికి తగ్గట్టు గోల్డ్, డైమండ్స్ లాంటి అమూల్యమైన బహుమతులు అందిస్తారు. కానీ ఓ భర్త మాత్రం ఎవరూ ఊహించని విధంగా తన భార్యకు అందమైన కానుక అందించాడు. ఏకంగా తాజ్ మహల్ ని పోలిన అందమైన ఇల్లు కట్టి బహుమతిగా ఇచ్చాడు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ నివాసి అయిన ఆనంద్ చోక్సే తన భార్య మంజుషాకు తాజ్ మహల్ లాంటి ఇల్లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు చెబుతున్నాడు. అదే సమయంలో చారిత్రక విశేషాన్ని కూడా పంచుకున్నాడు.
షాజహాన్ భార్య ముంతాజ్ చనిపోయిన తన స్వగ్రామంలో తాజ్ మహల్ ఎందుకు నిర్మించబడలేదని, దానికి బదులుగా ఆగ్రాలో ఎందుకు నిర్మించారని చోక్సే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇక షాజాహాన్ కు ముంతాజ్ పై ప్రేమ ఎంతగొప్పదో తన భార్య ఉన్న ప్రేమ కూడా అలాంటిదే అని నిరూపించాలని భావించాడు. ఇదంతా పూర్తి చేయడానికి అతడికి మూడేళ్లు పట్టినా.. ఆ కట్టడం మాత్రం అచ్చం తాజ్ మహాల్‌ను తలపించేలా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దానికోసం అతడు చాలానే కష్టపడ్డాడు. ఒరిజినల్ తాజ్ మహాల్‌ను చాలా దగ్గర నుండి స్టడీ చేశాడు.
అనుభవజ్ఞులైన ఇంజనీర్ల సాయంతో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించాడు. ఆ ఇంటికి కావాల్సిన ప్రతీ ఒక్కటీ చాలా దగ్గర ఉండి చూసుకున్నాడు. తాజ్ మహాల్ లాంటి స్తంభాలతో సహా అన్ని అచ్చం తాజ్ మహల్ లాగానే ఉండేలా చూసుకున్నాడు. మూడేళ్లకు అతడి కలల తాజ్ మహాల్ సిద్ధమయ్యింది. ఇల్లు 29 అడుగుల ఎత్తైన గోపురం మరియు వైపులా తాజ్ మహల్ లాంటి టవర్లతో చక్కదనం ప్రతిబింబిస్తుంది.
ఇంటి ఫ్లోరింగ్‌ను రాజస్థాన్‌లోని ‘మక్రానా’ నుండి తయారు చేయగా, ఇంటి సున్నితమైన ఫర్నిచర్ ముంబైకి చెందిన కళాకారులచే తయారు చేయబడింది. నాలుగు బెడ్‌రూమ్‌లతో పాటు, ఇంట్లో లైబ్రరీ, ధ్యాన గది కూడా ఉన్నాయి. తాజ్‌మహల్ లానే చీకటిలోనూ ఈ ఇల్లు వెలుగులు విరజిమ్మేలా లైంటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అందంగా, అద్భుతంగా నిర్మించిన ఈ తాజ్‌మహల్ ఇంటిని తన భార్యకు కానుకగా ఇవ్వడంతో ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఇప్పుడీ తాజ్‌మహల్ ఇల్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.