ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సిటీలో మంగళవారం సాయంత్రం ఘోరం జరిగింది. నాలుగు అంతస్తుల ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. గత 14 గంటల్లో 14 మందిని పోలీసులు, ఫైర్, రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ ప్రమాదంలో ముగ్గురు భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వజీర్ హసన్ గంజ్ రోడ్‌లోని ఈ పాత బిల్డింగ్ ఒక్కసారిగా కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలియగానే.. పోలీసులు, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద పదుల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఉత్తర భారత్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతే అయినా.. ప్రకంపనలు మాత్రం భారీగా ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రకంపనల వల్లే ఈ బిల్డింగ్ కూలిపోయిందా అనే కోణంలో అధికారులు సమీక్షిస్తున్నారు. ఇదిలాఉంటే.. బిల్డింగ్ కూలిన ఘటనలో సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే షాహీద్ మంజూర్ కుమారుడ్ని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ బిల్డింగ్ ఎస్పీ ఎమ్మెల్యే కొడుకు నవాజీష్, ఆయన మేనల్లుడికి చెందిందని తెలుస్తోంది. సుమారు 12 ఏళ్ల కింద నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 12 ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో చాలా మటుకు ఖాళీగా ఉన్నాయి. అయితే గ్రౌండ్ ఫ్లోర్‌లో పనులు జరుగుతున్నాయి. కాగా, మంగళవారం అర్ధరాత్రి ఈ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. కూలిపోవడానికి కారణాలను అధికారులు అన్వేషించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం నవాజీష్‌ను మీరట్ నుంచి లక్నోకు పోలీసులు తీసుకొస్తున్నారు.