అందరూ ఆనందాలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్నారు. కేకులు కోస్తూ, స్వీట్లు పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అందరూ నూతన సంవత్సరం జోష్ లో ఉంటే.. ఎల్పీజీ కంపెనీలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. కొత్త సంవత్సరం తొలి రోజే గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ అందరికీ ఛేదు వార్తను చెప్పాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నిచోట్ల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఈ వార్త విన్న వాపారస్తులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇక్కడ సమాన్యులకు ఊరటనిచ్చే అంశం ఏంటంటే పెరిగిన ధరలు కమర్షియల్ సిలిండర్ వి. అయితే గృహవినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు మిగిలిన నగరాల్లోనూ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో ఈ కమర్షియల్ సిలిండర్ ధర రూ.25 పెరిగి.. రూ.1,769కి చేరింది. హైదరాబాద్ లో రూ.1,973కి, కోల్ కతాలో రూ.1,870, ముంబైలో రూ.1,721, చెన్నైలో రూ.1,917కి చేరాయి. హైదరాబాద్ లో ఈ ధర రూ.1,973 ఉంటే వరంగల్ లో మాత్రం రూ.2,014, కరీంనగర్ లో రూ.2,016గా ఉంది.
విజయవాడలో రూ.1,947గా, విశాఖలో రూ.1,819కి చేరింది. జులై 6న డొమెస్టక్ సిలిండర్ ధరను రూ.50 పెంచిన కంపెనీలు మళ్లీ ఇప్పటివరకు ఆ ధరను సవరించలేదు. సామాన్యులు మాత్రం ఈ గ్యాస్ ధర స్థిరంగా ఉండటంపై ఊపిరి పీల్చుకున్నారు. అయితే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంపు మనపై కాదుగా అని అనుకుంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం వల్ల నష్టపోయేది సామాన్యులే అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాణిజ్య సిలిండర్ ధర పెరగడం వల్ల వ్యాపారులు, హోటల్స్, రెస్టారెంట్లు ధరలు పెంచేస్తాయి. ఒకసారి పెరిగిన ధర గ్యాస్ సిలిండర్ ధర తగ్గినా కూడా తగ్గవని గుర్తుంచుకోవాలి.