ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలో బస్తర్ జిల్లా ఒకటి. ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. కానీ పర్యాటకులు అక్కటి వెళ్లడానికి భయపడతారు. ఎంతోమంది ప్రజలు నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యారు. వారి పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. అలా నక్సలైట్ల చేతిలో బలైనా ఓ వ్యక్తి కూతురు.. కష్టాలకు ఎదురొడ్డి సూపర్ మోడల్ మిస్ ఇండియా కిరీటాన్ని ముద్దాడింది. ఆమే.. లిపి మిష్రమ్ అనే బస్తర్ జిల్లాకు చెందిన యువతి. పోటీలో పాల్గొన్న 30 మందిని వెనక్కి నెట్టి విజయం సాధించింది. మరి ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో లాండిగూడకి చెందిన లిపి అందరిలానే తండ్రి సంరక్షణలో పెరిగింది.తన కూతురు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలని ఆమె తండ్రికి కోరిక ఉండేది. కానీ 2009లో లాండిగూడలోని ఇంటి ముందు లిపి తండ్రిని నక్సలైట్లు దారుణంగా కాల్చి చంపారు. తండ్రి మరణంతో కుటుంబ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. ఆర్థిక కష్టాలు వారి చుట్టు ముట్టాయి. అయినా ఏమాత్రం బెదరకుండా.. తండ్రి కలను సాకారం చేయాలనే తపనతో.. లిపి మెష్రమ్ చదువుతో పాటు మోడలింగ్ షోల్లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఇటీవల గోవాలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని.. దేశ నలుమూలల నుంచి వచ్చిన పోటీదారులందరినీ ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది. అంతే కాకుండా టైటిల్ ను సొంతం చేసుకున్న అతి చిన్న వయస్కురాలిగా అరుదైన ఘనత సాధించింది.
ప్రస్తుతం ఆమె ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతోంది. సినీ ప్రపంచంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించు కోవాలనుకుంటోంది. ఆమె సామాజిక కార్యకర్త, గాయని కూడా. స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా లిపి ని బస్తర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారులు నియమించారు. “ఎవరైనా ఉన్నత స్థితికి రావాలంటే మంచి ఆలోచన అవసరం. నాకు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. దానికోసం కష్టపడ్డాను.. చివరికి సాధించాను. ఈ విజయం సాధించటంలో మా అమ్మ కృషి చాలా ఉంది” అని లిపి మిష్రమ్ అన్నారు. మరి.. కష్టాల కడలి దాటి వచ్చి.. మిస్ ఇండియా కిరీటం సాధించిన లిపి మిష్రమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.