ఆరుగాలం పండించిన పంటను మార్కెట్ చేసే సరికి ఆశించిన ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. శ్రమ తనదైనా.. అతడు పేదవాడుగా మారిపోతున్నాడు. అందుకే రైతుగా ఉండలేక కొంత మంది భూములు అమ్ముకుంటుంటున్నారు. కానీ నేటి యువ రైతులు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని
దేశానికి వెన్నుముక రైతు అంటారు. ఆరుగాలం పండించిన పంటను మార్కెట్ చేసే సరికి ఆశించిన ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. శ్రమ తనదైనా.. అతడు పేదవాడుగా మారిపోతున్నాడు. అందుకే రైతుగా ఉండలేక కొంత మంది భూములు అమ్ముకుంటుంటే.. మరికొంత మంది రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారానికి వినియోగిస్తున్నారు. కానీ నేటి యువ రైతులు కాస్త భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని వ్యవసాయంలో కొత్త మెళుకువలతో పాటు బహిరంగ మార్కెట్‌లో తమ పంటను లాభానికి ఎలా అమ్మకం చేయాలో తెలుసుకుంటున్నారు. పండించే పంటల విధానంలో కూడా కొత్త పోకడలను అనుసరిస్తున్నారు.
నూతన వంగడాలు, వాతావరణ పరిస్థితులు, నేల సారం, లాభదాయకమైన పంటలను సెలక్ట్ చేసుకుని సేద్యం చేపడుతున్నారు. అటువంటి యువ రైతుల్లో ఒకరు చత్తీస్‌ఘడ్‌లోని కొండగావ్ జిల్లా వాసి రాజారాం త్రిపాఠి. బస్తర్ ప్రాంతంలో కొండగావ్, జగదల్‌పూర్ జిల్లాల్లో నల్ల మిరియాలు, దుంప జాతికి చెందిన పంటలను సాగు చేస్తూ, అత్యధిక దిగుబడికి కారణమౌతున్నారు. నాలుగు సార్లు ఉత్తమ రైతు అవార్డు కూడా పొందాడు. ఇప్పుడు ఎకరాల్లో ఉన్న పంటను పిచికారీ చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తుంటే.. ఈ రైతు మాత్రం ఏకంగా హెలికాఫ్టర్ కొనేందుకు సిద్ధమయ్యాడు. ఏంటీ ప్రయాణించడానికి కాదా.. పంటలపై పిచికారీ కోసం అంటే నమ్మబుద్ది కావడం లేదు కదా. నిజమేనండీ.
తనకున్న వెయ్య ఎకరాల పొలంలో పురుగుల మందు,ఎరువులు పిచికారీ చేసేందుకు, ఇతర వ్యవసాయ సంబంధిత పనుల నిమిత్తం దీన్ని ఉపయోగించనున్నారు. ఇంగ్లాండ్, జర్మనీలో మందులు, ఎరువులు పిచికారీ చేసేందుకు హెలికాప్టర్లను ఉపయోగించడాన్ని చూసిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ హెలికాఫ్టర్‌ను రూ. 7 కోట్లకు కొనుగోలు చేయనున్నాడు. ఇప్పటికే హాలండ్‌కు చెందిన రాబిన్సన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆర్-44 మోడల్ (నాలుగు సీట్లు) హెలికాప్టర్‌ను బుక్ చేశారు. చేతులతో పురుగుల మందులను పిచికారీ చేయడం వల్ల పంటకు సరిగ్గా చేరకపోవచ్చునని, దీని వల్ల చీడపీడల వ్యాప్తికి దోహదం చేస్తాయని, అదే విమానం నుండి స్ప్రే చేయడం ద్వారా తగినంత ఎరువులు మొక్కకు అందుతాయని పేర్కొన్నారు.
ఎస్‌బీఐ ఉద్యోగి అయిన రాజారాం త్రిపాఠి.. తాత కూడా రైతే. రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు రాజారాం తన వృత్తిని వదిలిపెట్టి 1998లో వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఏడాదికి రూ.25 కోట్ల టర్నోవర్ సాధిస్తున్న రాజారాం.. ఐరోపా, అమెరికా దేశాలకు నల్ల మిరియాలను ఎగుమతి చేస్తున్నారు. మిరియాల పంట సాగులో ఆస్ట్రేలియా విధానాలను అవలంభిస్తున్నారు. ఈ హెలికాఫ్టర్ ఉజ్జయినిలోని ఏవియేషన్ అకాడమీ తనకు , తన కుమారుడికి, సోదరుడికి శిక్షణనిస్తుందని తెలిపారు. ఈ లెక్క ప్రకారం.. పొలం కోసం హెలికాఫ్టర్ కొంటున్న తొలి రైతు ఇతడే కావచ్చు..!